బీఆర్​ఎస్​, బీజేపీ ఒకే తాను ముక్కలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

బీఆర్​ఎస్​, బీజేపీ ఒకే తాను ముక్కలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • ‘కారు’ స్క్రిప్ట్ రాస్తే.. కమలం’ డెలివరీ చేస్తది
  • ధనిక రాష్ట్రమని షో చేసి ఆగం చేసిన్రు.. 
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • ఖమ్మం మున్నేరు పరీ వాహక ప్రాంతాల్లో పర్యటన  

ఖమ్మం రూరల్, వెలుగు : బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని, ఒకరు స్క్రిప్ట్ రాసిస్తే మరొకరు డెలివరీ చేస్తారని, ఢిల్లీ స్థాయిలోనే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సోమవారం ఖమ్మం మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రిటైనింగ్ వాల్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ధనిక రాష్ట్రం’ అంటూ గత పాలకులు షో చేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే లోగుట్టు మొత్తం బయట పడిందని తెలిపారు.

గత ప్రభుత్వం పదేండ్లలో రూ. 8.19 కోట్ల అప్పు చేసిందని,  ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని గర్తుచేశారు. సీతారామ ప్రాజెక్టు పనులు బీఆర్ఎస్ 90 శాతం పనులు పూర్తిచేస్తే ఇంకా 40 శాతం పనులు ఎలా మిగిలి ఉంటాయని,  కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ రావద్దని విపక్షాలు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతేడాది అకాల వర్షాలకు మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో నివాసముండే వేలాది కుటుంబాలు ఇబ్బందిపడ్డాయని, ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా రివర్ ఫ్రంట్ కాలనీలో చోటు కల్పిస్తామని, 500 ఎకరాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. 

మసీదుల అభివృద్ధికి కృషి 

పాలేరు నియోజకవర్గంలోని మసీదుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 18 మసీదుల అభివృద్ధి కోసం ఒక్కో మసీదుకు రూ. లక్ష చొప్పున  ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో  మంత్రి పొంగులేటి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో  కలిసి చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, మద్ది మల్లారెడ్డి, అంబటి సుబ్బారావు, బండి జగదీశ్, ఆజ్మరా అశోక్​ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదలకు అండగా ప్రజా ప్రభుత్వం

కూసుమంచి : నిరుపేదలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉండి, ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి సీఎంఆర్​ఎఫ్​ద్వారా సహాయం అందజేస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలో పర్యటించిన ఆయన  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎంపీడీఓ ఆఫీస్​లో 64 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, రూ.18.65 లక్షల విలువైన సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను 57 మంది బాధిత కుటుంబాలకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభత్వ ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదల కష్టాల్లో పాలు పంచుకోవాలని కల్యాణలక్ష్మితో పాటు, విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు. సీఎంఆర్​ఎప్​ గతేడాదిలో రూ.1,056 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈనెలాఖరు వరకు అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 4 వేల మందికి చేయూత నిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రూ.9 వేల కోట్లు ఖర్చు చేసి సబ్సిడీ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అనంతరం గోపాయిగూడెంలోని స్కూల్​ అదనపు తరగతి గది, మేడిదపల్లిలోని ఎస్సీ కాలనీ, తిమ్మక్కపేట, ఎర్రగడ్డ ఎస్సీకాలనీలో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్రనీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, ఏడీఏ సరిత, తిరుమలాయపాలెం ఎంపీడీఓ ఎస్​కే సిలార్ సాహెబ్, ఇన్​చార్జ్ తహసీల్దార్ సుధీర్, తదితరులు పాల్గొన్నారు.