
అశ్వారావుపేట, వెలుగు: ఇందిరమ్మ రాజ్యంలో పేద కుటుంబాలకు అండగా ఉంటామని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. సోమవారం అశ్వారావుపేట మండలంలో వారు పర్యటించారు. మండల కేంద్రంలో రూ.2.38 కోట్లతో నిర్మించిన పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దత్తత గ్రామమైన చెన్నాపురంలో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్నాపురం పేరు హైదరాబాద్ స్థాయిలో వినిపించాలని, అందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని తెలిపారు. త్వరలోనే గ్రామంలో కమ్యూనిటీ హాలును నిర్మించనున్నామన్నారు. పిల్లలను రెగ్యులర్గా స్కూళ్లకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. త్వరలో అశ్వారావుపేటలో ఉచితంగా గ్రూప్ వన్ కోచింగ్ సెంటర్ ను ప్రారంభిస్తున్నామని చెప్పారు.
అనంతరం తెలంగాణ సరిహద్దులోని గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, పీ ఆర్ డీఈ శ్రీధర్, నాయకులు జూపల్లి రమేశ్, తుమ్మా రాంబాబు, మిండా హరిబాబు, ఆకుల శ్రీను, ఫణి తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి : సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో రూ.75 లక్షలతో ఏర్పాటు చేసిన బోటింగ్, లైబ్రరీ, ఆర్ఓ వాటర్ ప్లాంట్, ఎన్ఐఎఫ్ మిషన్, యోగ షెడ్ లను ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్ భీమా నాయక్, డీఎఫ్ ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఎస్ఎఫ్ఎస్ మంజుల, పలువురు అటవీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.