15 వందల వీడియోలకే 6.51 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్లు.. ఈ ఇన్ఫ్లుయెన్సర్ నిజంగా గ్రేట్.. ఎందుకంటే.

15 వందల వీడియోలకే 6.51 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్లు.. ఈ ఇన్ఫ్లుయెన్సర్ నిజంగా గ్రేట్.. ఎందుకంటే.

ఒకవైపు బడికి వెళ్లి చదువుకుంటూనే మరోవైపు సాగు పాఠాలూ నేర్చుకున్నాడు. కాలేజీ రోజుల్లో ఎప్పుడు సెలవు దొరికినా పొలంలో వాలిపోయేవాడు. ఆ ఇష్టంతోనే చదువు పూర్తయ్యాక రైతుగా మారి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. కానీ.. తొలినాళ్లలోనే ఎన్నో సమస్యలు తలెత్తాయి. వాటి పరిష్కారాల కోసం ఆన్‌‌లైన్‌‌లో వెతికితే పెద్దగా సమాచారం దొరకలేదు. అందుకే తనలాంటి ఎంతోమంది రైతులకు మేలు చేయాలని యూట్యూబర్‌‌‌‌గా మారాడు దర్శన్‌‌ సింగ్‌‌. తన చానెల్‌‌ ద్వారా సాగులో మెళకువల నుంచి అగ్రికల్చర్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌ రివ్యూల వరకు ప్రతీది పంచుకుంటున్నాడు. ఇప్పుడది రైతులకు ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానం చెప్పే వేదికగా మారిపోయింది.  

దర్శన్‌‌ హర్యానాలోని ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. అందుకే అతను కూడా అదే వృత్తిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్కూల్‌‌, కాలేజీలో ఉన్నప్పుడు కూడా వ్యవసాయ పనుల్లో కుటుంబానికి సాయం చేసేవాడు. పొలిటికల్‌‌ సైన్స్‌‌లో పోస్ట్‌‌ గ్రాడ్యుయేషన్‌‌ చేసిన తర్వాత ఫుల్‌‌ టైం రైతుగా మారాడు. వారసత్వంగా 12 ఎకరాల భూమి వచ్చింది. రసాయన ఎరువులు వాడి పంటలు పండిస్తే ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయి? అనేది అతనికి బాగా తెలుసు. అందుకే అందరిలా కాకుండా వినూత్నంగా సేంద్రియ వ్యవసాయం చేయాలి అనుకున్నాడు. కానీ.. భూమి సేంద్రియ సాగుకు అలవాటు పడేందుకు రెండు మూడేండ్లు పడుతుంది. 

ఆ టైంలో దిగుబడి తగ్గి నష్టాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఆ నష్టాలను భర్తీ చేసుకునేందుకు పాడి పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ‘‘నేను 2017లో పశుపోషణ మొదలుపెట్టినప్పుడు దానిపై నాకు పెద్దగా నాలెడ్జ్‌‌ లేదు. అందుకే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటికి పరిష్కారాలు తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌‌లో వెతికా. కానీ.. సరైన సమాధానాలు దొరకలేదు. యూట్యూబ్‌‌లో సెర్చ్‌‌ చేశా. సరైన మేతను ఎంచుకోవడం, పశువులు అనారోగ్యం పాలైతే ఏం చేయాలి? లాంటి వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా వీడియోలు కనిపించాయి.

 కానీ.. వాటిలో నాకు ఎక్కడా సరైన సమాచారం దొరకలేదు. కొన్ని వీడియోల థంబ్‌‌నెయిల్స్‌‌ అట్రాక్టివ్‌‌గా  ఉన్నా కంటెంట్‌‌ చూస్తే సమాచారం వివరంగా లేదు. రైతులు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు వాళ్లకు మార్గనిర్దేశం చేయడానికి యూట్యూబ్‌‌లో ఎవరూ లేరని అర్థమైంది. అందుకే నాలాంటి రైతుల కోసం నేనే ఒక యూట్యూబ్‌‌ చానెల్‌‌ పెట్టి, దాని ద్వారా వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అలా 2017 సెప్టెంబర్‌‌‌‌లో ‘ఫార్మింగ్‌‌ లీడర్’ పేరుతో యూట్యూబ్‌‌ చానెల్‌‌ పెట్టా” అని తను యూట్యూబ్‌‌లోకి రావడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చాడు దర్శన్‌‌. 

ఫోన్‌‌తోనే రికార్డింగ్‌‌

దర్శన్‌‌ వ్యవసాయానికి సంబంధించిన ఏ కొత్త విషయం తెలుసుకున్నా తన మొబైల్‌‌తో వీడియో రికార్డ్‌‌ చేసి చానెల్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేసేవాడు. అలా యూట్యూబ్ ప్రపంచంలో తన ప్రయాణం ప్రారంభమైంది. ముఖ్యంగా పాడి పరిశ్రమపై ఎక్కువగా వీడియోలు చేసేవాడు. తన ప్రయాణంలో కలిసిన ఎంతోమంది సక్సెస్‌‌ఫుల్‌‌ రైతుల అనుభవాలను తెలుసుకుని యూట్యూబ్‌‌ ద్వారా పంచుకున్నాడు. 

ఆరు నెలల్లోనే వీడియోలకు వచ్చిన వ్యూస్‌‌, లైక్స్‌‌ సంఖ్య చూస్తే.. ఆ వీడియోలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని దర్శన్‌‌కు అర్థమైంది. అప్పుడే అతను చేసిన ఒక షార్ట్‌‌ వీడియోకు కొన్ని మిలియన్ల వ్యూస్‌‌ వచ్చాయి. 2018 మార్చి నాటికి చానెల్‌‌ ద్వారా కొంత డబ్బు కూడా వచ్చింది. దాంతో అతను క్రమం తప్పకుండా వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. 

వీడియోల క్వాలిటీ పెంచాలని కెమెరా, మైక్‌‌లు, ల్యాప్‌‌టాప్‌‌తోపాటు మరికొన్ని గాడ్జెట్స్‌‌ కొన్నాడు. చానెల్‌‌లో  పంటకు కావాల్సిన నాణ్యమైన ఎరువులను ఎంచుకోవడం దగ్గర నుంచి అగ్రికల్చర్‌‌‌‌లో వాడే పెద్ద పెద్ద మెషీన్లు ఆపరేట్‌‌ చేయడం వరకు ప్రతిదానిపై వీడియోలు చేశాడు. దాంతో అతనికి వ్యవసాయం ద్వారా వచ్చిన లాభం కంటే యూట్యూబ్‌‌ ద్వారానే ఎక్కువ  ఆదాయం వచ్చింది. అప్పటినుంచి దర్శన్ ఫుల్​టైం యూట్యూబర్‌‌‌‌గా మారిపోయాడు. 

ఎంతోమందికి మేలు

మహిళా రైతు సంతోష్ దేవి1.25 ఎకరాల్లో దానిమ్మ సాగు చేసి,  రూ. 25 లక్షలు సంపాదించి పేదరికాన్ని జయించింది. దర్శన్​ ఆమె గురించి చేసిన వీడియోకు బాగా రీచ్‌‌ వచ్చింది. దాంతో చానెల్‌‌ గురించి ఎంతోమంది రైతులకు తెలిసింది. ఆ తర్వాత రైతు లేనప్పుడు కూడా పశువులకు 24×7 నీరు అందేలా ఆటోమేటిక్ డ్రింకింగ్ బౌల్‌‌ను తయారుచేసిన హర్విలాస్ సింగ్ గురించి మరో వీడియో చేశాడు. అది కూడా దర్శన్‌‌కు మంచి పేరు తీసుకొచ్చింది. 

హర్యానాలోని సిర్సాలో ఉన్న ఎస్‌‌ఆర్‌‌‌‌ కమర్షియల్ గోట్ ఫామ్ యజమాని సందీప్ సింగ్‌‌ని కలిసి ‘గోట్ ఫామ్‌‌ను ఎలా ప్రారంభించాలి’ అనే వీడియో చేశాడు. ఈ వీడియో చూసి ఎంతోమంది సందీప్‌‌ని సంప్రదించి మరిన్ని మెళకువలు నేర్చుకున్నారు. ‘‘దర్శన్ మా ఫామ్‌‌కు సంబంధించిన వీడియో అప్‌‌లోడ్‌‌ చేసిన తర్వాత మా దగ్గరకు చాలామంది వచ్చారు. వాళ్లందరికీ మేం మేకల పెంపకంపై ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పటివరకు మా దగ్గర ఏడు రాష్ట్రాల పాడి రైతులు ట్రైనింగ్ తీసుకున్నారు. అంతేకాదు.. మాకు కస్టమర్ల నుంచి కూడా డిమాండ్‌‌ చాలా పెరిగింది” అని చెప్పాడు గోట్‌‌ఫామ్‌‌ యజమాని సందీప్‌‌. 

ఫాలోయింగ్‌‌

ఫార్మింగ్‌‌ లీడర్ చానెల్‌‌ పెట్టిన ఏడాదిలోపే అంటే 2018 ఏప్రిల్‌‌ 6 నాటికి లక్ష మంది సబ్‌‌స్ర్కయిబ్‌‌ చేసుకున్నారు. ప్రస్తుతం చానెల్‌‌కు 6.51 మిలియన్ల మంది సబ్‌‌స్క్రయిబర్లు ఉన్నారు. ఇప్పటివరకు చానెల్‌‌లో 1,562 వీడియోలు అప్‌‌లోడ్ చేశాడు. వాటిలో ఒక షార్ట్‌‌ వీడియోకు ఏకంగా 143 మిలియన్ల వ్యూస్‌‌ వచ్చాయి. దర్శన్‌‌కు యూట్యూబ్‌‌తోపాటు ఇతర సోషల్‌‌ మీడియో ఫ్లాట్‌‌ఫామ్స్‌‌లో కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. అతని ఫేస్‌‌బుక్ పేజీని 7.7 మిలియన్లు, ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో రెండు లక్షలకుపైగా మంది ఫాలో అవుతున్నారు.

ఫార్మర్‌‌‌‌ టూ సెలబ్రెటీ 

 యూట్యూబర్‌‌గా మారిన తర్వాత ఎక్కడికి వెళ్లినా దర్శన్‌‌ని ప్రజలు గుర్తుపడుతున్నారు. ‘‘చాలామంది సెల్ఫీలు తీసుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారు. సబ్‌‌స్క్రయిబర్ల సంఖ్య పది లక్షలు దాటినప్పటి నుంచి ప్రమోషన్లు కూడా చేస్తున్నా. వ్యవసాయ పనిముట్లు, మెషీన్లను తయారుచేసే కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌‌ రివ్యూ చేయాలని సంప్రదిస్తున్నాయి.

 నేను మాత్రం రైతుకు నష్టం జరగకూడదని ప్రొడక్ట్‌‌ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే రివ్యూ చేస్తున్నా” అని చెప్పుకొచ్చాడు దర్శన్‌‌. అతను ఇప్పుడు వీడియోలు చేయడమే కాకుండా హర్యానాలోని ఎంతోమంది రైతులకు వినూత్న సాగు పద్ధతులపై ట్రైనింగ్‌‌ ఇస్తున్నాడు. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు తిరిగి వీడియోలు చేసిన దర్శన్ భవిష్యత్తులో విదేశాలకు వెళ్లి అక్కడి వ్యవసాయ పద్ధతులపై వీడియోలు చేస్తానంటున్నాడు.