కుంటాల, వెలుగు: పిడుగు పడి ఓ రైతు మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కుంటాల మండలకేంద్రానికి చెందిన న్యాకపు సుధాకర్(60) గురువారం పశువులను మేపేందుకు పొలానికి వెళ్లాడు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో సమీపంలోని మామిడి చెట్టు కింద తలదాచుకున్నాడు. ఈ సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమీపంలో ఉన్న రైతులు పెద్ద శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా సుధాకర్ అప్పటికే మృతిచెందాడు. శరీరంపై కాలిన గాయాలను గుర్తించారు. ఘటన స్థలాన్ని తహసీల్దార్ కమల్‌సింగ్, ఎస్సై అశోక్ పరిశీలించారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
