ధాన్యంలో కోత విధించారని..పెట్రోల్ బాటిల్ తో రైతు ఆందోళన

ధాన్యంలో కోత విధించారని..పెట్రోల్ బాటిల్ తో రైతు  ఆందోళన

చండూరు, వెలుగు:  కొనుగోలు కేంద్రాల్లో కొన్న వడ్లలో అధికంగా కోత విధించడంతో  పెట్రోల్​బాటిల్​ పట్టుకుని రైతు ఆందోళన చేశాడు. నల్గొండ జిల్లా చండూరు రైతు సేవ సహకార సంఘం  వద్ద ఈ ఘటన జరిగింది. అంగడిపేటకు చెందిన కడారి ఆంజనేయులు అనే రైతు ఆందోళన చేశాడు. 234    ధాన్యం బస్తాలను ఇడికోజు నాగరాజు పేరున అమ్ముకుంటే, 208 బస్తాలకు ట్రక్ షీట్ ఇచ్చారని రైతు తెలిపారు. మిగతా బస్తాలకు  బిల్లులు ఎందుకు ఇవ్వలేదని సీఈవోని రైతు ప్రశ్నించారు. సీఈఓ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. తాలు పేరుతో క్వింటాల్​ కు 10 కిలోల ధాన్యం కట్ చేసి మోసం చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్ముకున్న ధాన్యానికి బిల్లులు ఇవ్వకుండా రూ. 20 వేలు కోత విధించడం ఏమిటని ప్రశ్నించాడు. చండూరు  మండలంలోని మూడు సెంటర్లలో కలిపి 45 వేల క్వింటాళ్ల ధాన్యం కోనుగోలు చేశారన్నారు.  

ALSOREAD:అమెరికన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో..హార్వెస్ట్ ఆల్​ఇండియా ఫస్ట్

మిల్లర్లతో అధికారులు కుమ్మకై  కోత విధించి సుమారు 90 లక్షల వరకు అవినీతికి పాలపడ్డారని ఆరోపించాడు. తనతో పాటు మిగతా రైతులకు న్యాయం జరిగే వరకు  కార్యాలయం వద్దే ఆందోళన చేపడుతానని హెచ్చరించాడు. చేతిలో పెట్రోల్​ బాటిల్ పట్టుకుని​ తనకు న్యాయం చేయాలని కోరాడు.  సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతు భీష్మించుకు కూర్చున్నాడు. న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో రైతు ఆందోళన విరమించాడు.