
- పోడు రైతును కొట్టి చీకటి గదిలో బంధించారు
- నర్సంపేట అటవీ ఆఫీసర్ల నిర్వాకం
నర్సంపేట, వెలుగు : ఫారెస్టు అధికారులు పోడు రైతును విపరీతంగా కొట్టి, చీకటి గదిలో 12 గంటల పాటు బంధించిన ఘటన నర్సంపేట పట్టణంలోని ఫారెస్టు రేంజ్ ఆఫీసులో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా గుండెంగ గ్రామానికి చెందిన అంగిడి సమ్మయ్య నెక్కొండ మండలం నాగారంలోని అటవీ భూమిని 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల ఫారెస్ట్ సిబ్బంది హరితాహారం కార్యక్రమంలో భాగంగా సమ్మయ్య భూమిలో మొక్కలు నాటేందుకు ప్రయత్నించగా.. అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహంతో అటవీ అధికారులు సమ్మయ్యను కొట్టుకుంటూ నర్సంపేట అటవీకార్యాలయానికి తీసుకెళ్లారు. ఉదయం 8 గంటలకు ఆఫీసులోని ఓ గదిలో బంధించిన అధికారులు, కాళ్లు మొక్కినా కనికరించకుండా కొట్టారనీ, సర్పంచ్ వచ్చినా తమ దగ్గర లేడని చెప్పారని వాపోయాడు. అనంతరం మీడియా చొరవతో తనను రాత్రి 8 గంటల సమయంలో వదిలివేశారంటూ సమ్మయ్య కన్నీరుమున్నీరయ్యాడు.