
- రైస్ మిల్లుల్లో వాడే కాంటాలు పెడుతున్నారని రైతుల ఆరోపణ
- జోగులాంబ గద్వాల జిల్లాలో 69 కొనుగోలు కేంద్రాలు
గద్వాల, వెలుగు: వరి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ వడ్లకు 4 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా వడ్ల కొనుగోళ్లలో వేగం పుంజుకోవడంతో దోపిడీకి తెరలేపారని అంటున్నారు. 40 కేజీల బస్తాకు 500 గ్రాముల తరుగు తీయాల్సి ఉండగా కిలోన్నర నుంచి 2 కిలోల తీస్తున్నారని వాపోతున్నారు. అలాగే, క్వింటాల్వడ్లకు రూ.50 హమాలీ ఛార్జీ తీసుకుంటున్నారని చెబుతున్నారు. ధరూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే సెల్ ఫోన్ లైట్ల మధ్య తూకాలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సివిల్ సప్లై వారు సరఫరా చేసిన ఎలక్ట్రానిక్ కాంటాలకు బదులుగా రైస్ మిల్లుల్లో ఉపయోగించేవి వాడుతున్నారని, తమను మోసం చేసేందుకు ఇలా చేస్తున్నారని
అంటున్నారు.
కొనుగోలు కేంద్రాలకు పోటీ
జోగులాంబ గద్వాల జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు 69 సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిని దక్కించుకునేందుకు గ్రామాల్లోని మహిళా సంఘాలు, నాయకులు పోటీ పడ్డారు. కొన్నిచోట్ల పోటాపోటీగా రెండు వర్గాలకు చెందిన కొనుగోలు కేంద్రాలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళా సంఘాలకు కేటాయించిన మెజార్టీ సెంటర్లను లీడర్లే నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
తరుగు వడ్లకు బినామీ రైతులు?
తరుగు తీసిన వడ్లను బినామీ రైతుల పేరిట కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మినట్లు రికార్డులు సృష్టిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తూకం వేశాక రైతుకు అక్కడే ఇన్ని క్వింటాళ్లు విక్రయించినట్లు కాగితంపై రాసిస్తున్నారు. సెంటర్ల నిర్వాహకులు ఒక్కో లారీకి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు దండుకుంటున్నారని, మళ్లీ వీరికి ప్రభుత్వం ఇచ్చే కమీషన్ వేరేగా ఉంటుందని పలువురు మండిపడుతున్నారు.
ఎంక్వైరీ చేస్తాం
కొనుగోలు కేంద్రాల్లో 500 గ్రాములకు మించి తరుగు తీయకూడదు. ఇతర కాంటాలు కూడా వాడొద్దు. ఈ విషయమై ఎంక్వైరీ చేస్తాం. దోపిడీ జరిగినట్లు తేలితే సెంటర్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేస్తాం.
నర్సింగరావు, అడిషనల్ కలెక్టర్, గద్వాల
కేజీన్నర తరుగు తీసిన్రు
40 కేజీల బస్తాకు కేజీన్నర తరుగు తీసిన్రు. ఎంత తీస్తున్నరో మొదట చెప్పలేదు. నిర్వాహకులను బతిమాలి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. బయట డిమాండ్ లేకపోవడం, బోనస్ వస్తుండటంతో ఇక్కడ అమ్ముకుంటున్నం.
నరసింహులు, రైతు, మార్లబీడు