మెదక్ జిల్లాలో యూరియా కొరతను నిరసిస్తూరాస్తారోకో

మెదక్ జిల్లాలో యూరియా కొరతను నిరసిస్తూరాస్తారోకో

చిలప్​చెడ్, రామాయంపేట, శివ్వంపేట, సిద్దిపేట రూరల్, వెలుగు: యూరియా కొరతను నిరసిస్తూ మెదక్ జిల్లా చిలప్ చెడ్​మండలం చిట్కుల్ చౌరస్తా వద్ద గురువారం ఎమ్మెల్యే సునీతారెడ్డి రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు అండగా నిలబడతామని, మార్పు తీసుకొస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ఎరువుల సరఫరాలో పూర్తిగా విఫలమయిందన్నారు. తిండి తిప్పలు లేకుండా రైతులు యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

గెలిపించిన రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారన్నారు. రామాయంపేటలో యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. రైతులతో కలిసి మెదక్ రహదారిపై బైఠాయించారు. పోలీసులు చేరుకుని వారికి నచ్చచెప్పి విరమింపజేశారు. అనంతరం తహసీల్దార్ రజినీ కుమారికి వినతి పత్రం అందజేశారు. శివ్వంపేటలో యూరియా కోసం మండలంలోని వివిధ గ్రామాల రైతులు వ్యవసాయ శాఖ ఆఫీసుకు తరలివచ్చి ఏవో లావణ్యను నిలదీశారు. 

భారీగా రైతులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు మధ్య టోకెన్లు జారీ చేసి యూరియా పంపిణీ చేశారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని రాఘవపూర్ గ్రామంలో బీఆర్​ఎస్​లీడర్లు, రైతులు రోడ్డు పై కూర్చుని నిరసన తెలిపారు. మిట్టపల్లి గ్రామంలో రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నా కేవలం ఒక బస్తా మాత్రమే యూరియా లభిస్తుందని ఇది దేనికి సరిపోవడం లేదని వాపోయారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్​నాయకులు, రైతులు పాల్గొన్నారు.