
- చివరి నిమిషంలో గుర్తించి బయటకు తీసుకొచ్చిన పోలీసులు
- మెదక్ కలెక్టరేట్‌లో ఘటన
సిద్దిపేట, వెలుగు : తన భూసమస్య పరిష్కారం కాకపోవడంతో ఆవేదనకు గురైన ఓ రైతు కవర్‌లో డీజిల్ పోసుకొని కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చాడు. చివరి నిమిషంలో గుర్తించిన పోలీసులు అతడిని బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన సోమవారం సిద్దిపేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... అక్కన్నపేట మండలం గోవర్ధనగిరికి రైతు చిలుపూరి ఎల్లారెడ్డికి వారసత్వంగా వచ్చిన పది ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ భూమితో పాటు, ఎల్లారెడ్డి సొంతంగా కొనుక్కున్న మరో 17 ఎకరాలను సైతం రెవెన్యూ ఆఫీసర్లు బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు.
దీంతో రైతు బంధు రాకపోవడంతో పాటు అతడు పండించిన పంటను సైతం ఐకేపీ కేంద్రంలో కొనుగోలు చేయడం లేదు. తన సమస్యను పరిష్కరించాలని అక్కన్నపేట తహసీల్దార్‌కు ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం ఓ కవర్‌లో డీజిల్ నింపుకొని, దానిని నడుముకు చుట్టుకొని కలెక్టరేట్‌లోని ప్రజావాణికి వచ్చాడు.
చివరి నిమిషంలో గమనించిన పోలీసులు ఎల్లారెడ్డిని ప్రజావాణి హాల్ నుంచి బయటకు తీసుకొచ్చి డీజిల్‌తో ఉన్న కవర్‌ను లాగేసుకున్నారు. అనంతరం ఎల్లారెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రజావాణిలో సైతం పలుమార్లు అర్జీలు ఇచ్చినా.. తన సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను సొంతంగా కొనుక్కున్న భూమిని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించాలని కోరారు. తరువాత పోలీసులు ఎల్లారెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు.
ప్రజావాణిలో పెట్రోల్ పోసుకున్న వ్యక్తి
యాదాద్రి, వెలుగు : తన భూమి సమస్యను పరిష్కరించడం లేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి ప్రజావాణికి వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఈ ఘటన ఘటన యాదాద్రి కలెక్టరేట్ వద్ద సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లికి చెందిన తడకపల్లి ఆగిరెడ్డికి సర్వేనంబర్ 340, 345ఏ, 346లో కొంత భూమి ఉంది. ధరణి వచ్చిన తర్వాత ఆ భూమి మహిపాల్‌రెడ్డి అనే పేరున ఉన్నట్లు కనిపిస్తోంది.
దీంతో భూమిని తన పేరు పైకి మార్చాలని అప్లై చేసుకున్నాడు. తర్వాత పలుమార్లు బొమ్మలరామారం తహసీల్దార్‌ను కలిశాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం పెట్రోల్ బాటిల్‌తో యాదాద్రి కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి వచ్చాడు. లోపలికి వెళ్లాక.. కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఎదుటే తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. గమనించిన పోలీసులు వెంటనే బాటిల్‌ను లాక్కున్నారు. స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ
ఇచ్చారు.