వానలు రావట్టే.. వడ్లు కొనకపాయె!

వానలు రావట్టే.. వడ్లు కొనకపాయె!

సీఎం చెప్పినా  కొనుగోళ్లు స్పీడ్ ​కాలే
పండింది 1.32 కోట్ల టన్నులు.. కొన్నది 74 లక్షల టన్నులు
నిండిన రైస్ ​మిల్లులు, గోడౌన్లు
ప్లేస్​ లేక రైతువేదికలు, కలెక్టరేట్లలో నిల్వ
ఇంకా 30 లక్షల టన్నులు కల్లాల్లో ఉందని అంచనా
కొనుగోళ్లు లేట్.. వర్షాలతో రైతుల్లో ఆందోళన

వెలుగు, నెట్​వర్క్​: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు మొదలై రెండు నెలలు గడిచినా ఇంకా 30 శాతానికి పైగా వడ్లు కొనుగోలు సెంటర్లలోనే మూలుగుతున్నాయి. ఇప్పటికే చెడగొట్టు వానల వల్ల నాలుగైదుసార్లు ధాన్యం తడిచింది. మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు రానున్నాయి. ఈలోపే చాలాచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో జూన్​1 కల్లా కొనుగోళ్లు కంప్లీట్​ కావాలని  సీఎం కేసీఆర్​ఆదేశించినా పరిస్థితిలో మార్పు రాలేదు. యాసంగిలో కోటి టన్నులకు పైగా ధాన్యం అమ్మకానికి వస్తుందని ఆఫీసర్లకు ముందే తెలిసినా ఆమేరకు ఏర్పాట్లు చేయలేదు. కావాల్సిన బార్దాన్, సరైన ట్రాన్స్​పోర్ట్ లేకపోవడం, ఉన్న రైస్​మిల్లులు, గోడౌన్లు నిండిపోయి దాచుకునేందుకు ప్లేస్​లేక చాలా జిల్లాల్లో కొనుగోళ్లు లేటవుతున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుత వర్షాలతో వ్యవసాయ పనులు స్టార్ట్​చేయాల్సిన టైంలో ఇంకా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దొడ్డు వడ్లు దాసుకుంటరట!
రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఎకరానికి  25 క్వింటాళ్ల చొప్పున దాదాపు 1.31 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందనే అంచనాలున్నాయి. వీటిలో కేవలం 90 లక్షల టన్నులు మాత్రమే మార్కెట్​కు వస్తాయని ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ యాసంగిలో రైతులు సన్నాలకు బదులు 90 శాతానికి పైగా దొడ్డు రకాలే సాగు చేశారు. రైతులు సన్నవడ్లను ఇండ్లలో దాచుకునే చాన్స్​ ఉన్నా, దొడ్డు రకాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకుంటారు. ఈ లెక్కన మార్కెట్​కు ఆఫీసర్ల అంచనాను మించి కోటి టన్నులకు పైగా ధాన్యం అమ్మకానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆఫీసర్లు మాత్రం 90 లక్షల టన్నులనే దృష్టిలో పెట్టుకొని జూన్​ 1 నాటికి 80 ‌‌శాతం(74.37 లక్షల టన్నులు) కొన్నామని, మరో 20 శాతం మాత్రమే మార్కెట్​లో ఉందని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఏ సెంటర్​లో చూసినా కనుచూపు మేర వడ్ల రాశులు కనిపిస్తున్నాయి. జిల్లాలవారీగా వస్తున్న సమాచారాన్ని బట్టి ఇంకా 30 నుంచి 40 శాతం నిల్వలు కొనుగోలుకేంద్రాల్లోనే మూలుగుతున్నాయి.

ఆఫీసర్ల అంచనా తప్పింది 

ఈ యాసంగిలో  1.32 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న గోడౌన్ల కెపాసిటీ 30 లక్షల టన్నులలోపే ఉంది. ఎఫ్​సీఐ గోడౌన్లన్నీ సీఎంఆర్​తోనే నిండిపోయాయి. దీంతో మొదట్లో కాంటా పెట్టిన వడ్లను నేరుగా ప్రైవేట్​రైస్​ మిల్లులకు తరలించడంపైనే ఆఫీసర్లు ఫోకస్​పెట్టారు. దొడ్డు వడ్లను పారాబాయిల్డ్​ రైస్​ మిల్లులు మాత్రమే కొంటాయి. ఈ యాసంగిలో పండిన వడ్లను మన రాష్ట్రంలోనే స్టోర్​చేసి, మిల్లింగ్​చేయాలంటే కనీసం 3,500 నుంచి 4వేల వరకు పారాబాయిల్డ్​ మిల్లులు అవసరం. కానీ  ప్రస్తుతం స్టేట్​వైడ్​ 950 బాయిల్డ్​ మిల్లులు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఎంత నిల్వ చేయగలమనేదానిపై ఆఫీసర్లకు క్లారిటీ లేకుండా పోయింది. ఎఫ్ సీఐ వివిధ రాష్ట్రాలకు అందించాల్సిన సీఎంఆర్ ఎప్పటికప్పుడు తీసుకెళ్తే మిల్లుల్లో స్థలం సమస్య ఉండేది కాదని సివిల్​ సప్లై మంత్రి గంగుల కమలాకర్​ చెబుతున్నారు. కానీ దిగుబడి, గోడౌన్ల కెపాసిటీ, రైస్​మిల్లుల సంఖ్య, ఎఫ్​సీఐ తీరుపై ముందు నుంచే ఒక అంచనా ఉన్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని రైతు సంఘాల లీడర్లు ప్రశ్నిస్తున్నారు. 

అన్ని సెంటర్లలోనూ అవే సమస్యలు 

స్టేట్​వైడ్​6,957 పీఏసీఎస్, ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రస్తుతం వడ్లు కొంటున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. అన్ని సెంటర్లలోనూ ఒకేరకమైన సమస్యలు ఉన్నాయి. పలు జిల్లాల్లో ధాన్యం ట్రాన్స్​పోర్ట్​ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత నెల 12 నుంచి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ వల్ల లారీ డ్రైవర్లలో చాలామంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారని చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో సెంటర్లకు సరిపడా లారీలు రావడం లేదు.  రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్​ ఆఫీసర్లు రోడ్ల మీద వెళ్లే రవాణా, ఇసుక లారీలను బలవంతంగా రప్పించే ప్రయత్నం చేస్తున్నా అనుకున్న స్థాయిలో సక్సెస్​ కావట్లేదు. మరోవైపు రైస్​మిల్లుల్లో ఎక్కువగా బిహార్, జార్ఖండ్, చత్తీస్‌‌గఢ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన హమాలీలు, కూలీలే పనిచేస్తున్నారు. వీళ్లంతా లాక్​డౌన్​కారణంగా సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో వడ్ల అన్​లోడ్​ ఆలస్యమవుతోందని మిల్లర్లు అంటున్నారు. పలు మిల్లుల్లో నిల్వలు పేరుకపోవడంతో ప్లేస్​ లేక లారీలను పంపవద్దని చెబుతున్నారు.  ఇక కొన్ని సెంటర్లలో సరిపడా బార్దాన్​ లేక వడ్లను కాంటా పెట్టలేని పరిస్థితి. దీంతో స్టేట్​వైడ్​ వేలాది సెంటర్లలో రైతులు వడ్ల కుప్పలపై పట్టాలు కప్పుకొని తమ వంతు కోసం  కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

కలెక్టరేట్​లో వడ్లు 
మెదక్​ జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో వరి పండగా 4.50 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. 350 సెంటర్ల ద్వారా ఇప్పటివరకు  2.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రైస్​మిల్లులు, గోడౌన్లు నిండిపోయాయి. ఇంకా 1.80 లక్షల టన్నులు సెంటర్లలో పేరుకపోయాయి. రైతులు గగ్గోలు పెడుతుండడంతో ఆఫీసర్లు స్కూళ్లు, కాలేజీలు ఎక్కడ పడితే అక్కడికి ధాన్యం తరలించి నిల్వ చేస్తున్నారు. ఆఖరుకు మెదక్ శివారులో కొత్తగా కట్టిన ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​మెయిన్​ బిల్డింగ్​మధ్యలో ఉన్న  ఖాళీ ప్రదేశంలో ఇలా వడ్ల బస్తాలను నెట్టుకొట్టారు.
నెల నుంచి పడిగాపులు 
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి వ్యవసాయ మార్కెట్ లో నెలరోజుల నుంచి వడ్లు కాంటాగాక రైతులు పడిగాపులు పడుతున్నారు. ఒక్కో రైతుకు తిండితిప్పలకు, చాయ్​ పానీకి రోజుకు ఎంత లేదన్నా రూ. 100 ఖర్చవుతోంది. ఏప్రిల్ 28న ఇక్కడ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం  ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 723 మంది రైతుల నుంచి 47,166.40 క్వింటాళ్ల వడ్లను  కొనుగోలు చేశారు.  ఇంకా సుమారు 10 వేల క్వింటాళ్ల వడ్లు కొనుగోలుకు రెడీగా ఉన్నాయి. రోజుకు దాదాపు 20 లారీలను లోడ్ చేయాల్సి ఉండగా..  రెండు, మూడు లారీలే వస్తున్నాయి. దీంతో మార్కెట్లో నిల్వలు పెరిగిపోతున్నాయి. 

వడ్లు మొలకలొస్తున్నాయి 
కల్లంలో వడ్లు పోసి 25 రోజులైతంది. తాలు లేదు. మంచిగా ఎండినయి. కానీ కాంట పెట్టలేదు. ఇంతల్నే రెండు సార్లు వాన పడి తడిసినయి. ఇప్పుడు మొలకలొస్తున్నయి. ఏం చేయాల్నో తెలుస్తలేదు. ఎవుసం చేసుడు కన్నా కూలికి పోయినా మంచిగుండు. ఇప్పుడు ఈ వడ్లకు వచ్చే పైసలు పెట్టుబడికి కూడా సరిపోవు. - జెంజిరాల లక్ష్మి, మన్వాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా 
నెలైనా కొంటలేరు 
మాది కొండమల్లేపల్లి మండలం కొర్రతండా.  నెల రోజుల కింద వడ్లను అమ్మేందుకు మార్కెట్ కు తెచ్చిన. ఇప్పటివరకు కాంటా వేయలేదు. దీంతో రోజు తండా నుంచి మార్కెట్​కు వస్తున్న.  ఇప్పటి కైనా నా వడ్లను కాంటా వేయాలి.                      - కొర్ర మోతి, కొండమల్లేపల్లి, నల్గొండ జిల్లా