హైదరాబాద్​ల పైసలిస్తున్నరు..మాకెందుకియ్యరు?

హైదరాబాద్​ల పైసలిస్తున్నరు..మాకెందుకియ్యరు?
  • పంట మునిగిన రైతుల ఆగ్రహం
  • రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల ఎకరాల్లో పంట నష్టం
  • 8 లక్షల కుటుంబాలపై తీవ్ర ప్రభావం

హైదరాబాద్‌, వెలుగు: ‘చేతికొచ్చిన టైమ్​లో వానలు పడి పంట ఆగమైంది. ఎకరాలకు ఎకరాలు నీట ముగినయ్. కండ్ల ముందే ధాన్యం పాడైపోయింది. ఇంత జరిగినా ఇప్పటికీ లీడర్లు గానీ, అధికారులు గానీ ఒక్కరూ రాలె. సూడలె. వేలకు వేలు పోసి పంటలేసినం. ఇప్పుడు మా పరిస్థితేంది? మేమేం పాపం జేసినం? మాకేం ఇయ్యరా?’ అంటూ జిల్లాల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్​ఎంసీలో సాయం ప్రకటించిన సర్కారు జిల్లాలకు ప్రకటించకపోవడంతో ఆందోళన బాట పట్టారు. ములుగు జిల్లాలో రైతులు ధర్నా చేశారు.భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటనష్టం జరిగింది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రైతుల భారీగా నష్టపోయారు. పత్తి, వరి, కంది, సోయ, వేరుశనగ, మొక్కజొన్న, మిరప, పంటలు బాగా దెబ్బతిన్నాయి. పెసర, నువ్వులు, మినుములకు ఇప్పటికే 80% వరకు నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 36 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 15 లక్షల ఎకరాల్లో పత్తి, 12 లక్షల ఎకరాల్లో వరి, 4 లక్షల ఎకరాల్లో కంది, ఇతర పంటలు మరో 5 లక్షల వరకు పాడైపోయాయి. ఎకరాకు 40 వేల నుంచి 60 వేల పంట నష్టం జరిగిందనుకున్నా 15 వేల కోట్ల దాకా నష్టం ఉండొచ్చని అంచనా. సుమారు 8 లక్షల రైతుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడింది.

జిల్లాల్లో వేల ఇండ్లు పాడైనయ్‌‌

ఈ సీజన్‌‌లో ఇప్పటి దాకా మూడుసార్లు కుండపోత వర్షాలు కురిశాయి. సాధారణం కంటే 52% ఎక్కువ వానలు పడ్డాయి. 17 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వానలకు ఉమ్మడి వరంగల్‌‌, కరీంనగర్‌‌తో పాటు అనేక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వేల ఇండ్లు పాడైపోయాయి. నేతన్నల మగ్గం గుంటలకు నీళ్లు చేరాయి. వరంగల్‌‌ అర్బన్​లో వరదలకు ఇండ్లల్లోకి నీళ్లొచ్చాయి. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోలేదు. వరంగల్ లో నష్టం జరిగితే పట్టించుకోని సర్కారు.. జీహెచ్‌‌ఎంసీలో పరిహారం ప్రకటించింది. దీంతో తమను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా ప్రజలు, రైతాంగం నిలదీస్తోంది.

కన్నీళ్లే మిగిలినయ్

మూడెకరాల్లో సన్నరకం వరి, రెండెకరాల్లో మక్కలెసిన. వరి 150 బస్తాల వరకు దిగు బడి వచ్చేది. వానలతో మొత్తం పోయింది. కోతకొచ్చి నంక వానలు పడడంతో 70 వేల విలువ చేసే మక్కపంట ఆగమైంది.

– బడ్క లక్ష్మయ్య, దెబ్బడగూడ గ్రామం,   కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా

బీమా లేదు.. హామీ లేదు..

రాష్ట్రంలో వానల వల్ల నష్టం జరిగి వారం రోజులైనా ప్రభుత్వం స్పందించలేదు. 15 లక్షల ఎకరాల నష్టం జరిగినట్లు అధికారికంగా గుర్తించినా నష్ట పరిహారంపై ప్రకటన చేయలేదు. పంటలు దెబ్బతిన్నప్పుడు గ్రౌండ్ లెవెల్​లో వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయిస్తారు. పంట నష్టం అంచనా వేస్తారు. ఈసారి భారీ మొత్తంలో నష్టం జరిగినా అధికారులతో సర్కారు సర్వే చేయించలేదు. ఈ ఏడాది పంట బీమా అమలు చేయలేదు. ఐదేళ్లుగా ఇన్‌‌పుట్‌ సబ్సిడీ ఇవ్వట్లేదు.