యాసంగి వడ్ల పైసలు రాక పెట్టుబడుల కోసం రైతుల తిప్పలు

యాసంగి వడ్ల పైసలు రాక పెట్టుబడుల కోసం రైతుల తిప్పలు

కామారెడ్డి, వెలుగు: ‘యాసంగి వడ్ల కాంటా కంప్లీట్ అయి వారాలు గడుస్తున్నాయి.. కానీ అమ్మిన వడ్ల పైసలు ఇంకా రాలేదు. వానాకాలం సీజన్ వచ్చింది. పంటల పెట్టుబడులకు పైసలు యాడ నుంచి తేవాలి..’ అని రైతులు ఆందోళన  చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్‌‌‌‌లో జిల్లా వ్యాప్తంగా 3.4 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు సెంటర్లకు వస్తాయని ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ 55,869 మంది రైతుల నుంచి  2.70 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఇందుకు రైతులకు రూ.530 కోట్లు చెల్లించాలి. అయితే ఇందులో ఇంకా 10,500 రైతులకు రూ.104 కోట్ల మేర సొమ్ము గవర్నమెంట్​ చెల్లించాల్సిఉంది. వడ్లు కాంటా పెట్టిన 48 గంటల్లోగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు పలుమార్లు మంత్రులు చెప్పినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.   

అగిన చెల్లింపుల పక్రియ..

జిల్లాలో 20 రోజుల కింద కొంత మంది రైతుల అకౌంట్లలో పైసలు జమ చేశారు. ఆ తర్వాత చెల్లింపులు ఆగిపోవడంతో రైతులు ఆఫీసర్లకు తరచూ ఫోన్లు చేయడంతో పాటు సొసైటీలు, బ్యాంకులకు చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని చోట్ల సొసైటీలకు వెళ్లి వాదనకు దిగుతుండడంతో ఇక్కడి ఆఫీసర్లు జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్లకు ఫోన్లు చేస్తున్నారు.  

మొదటి నుంచి డిలేనే..

యాసంగి సీజన్‌‌‌‌లో వడ్ల కొనుగోళ్లు షురూ చేసినప్పటీ నుంచి పైసల చెల్లింపుల్లో డిలే జరిగింది.  సెంటర్లలో వడ్లును కాంటా పెట్టడం, ఆన్​లైన్‌‌‌‌లో ఎంట్రీ, రైసు మిల్లుల నుంచి తక్ పట్టీలు రావడం అలస్యం జరిగింది. ఈ పక్రియ కంప్లీట్​అయిన తర్వాత కూడా రైతుల అకౌంట్లలో వారం నుంచి 10 రోజుల తర్వాత పైసలు జమ అయ్యాయి. ప్రస్తుతం వానకాలం సీజన్‌‌‌‌లో పంటల సాగుకు పెట్టుబడుల కోసం రైతులకు డబ్బుల అవసరముంది. వడ్ల పైసలు వస్తే కొంత మేర ఇబ్బందులు తీరుతాయని రైతులు భావిస్తున్నారు. కానీ ఇన్‌‌‌‌టైంలో వడ్ల పైసలు రాక జిల్లాలో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

పైసలు రాక తిప్పలవుతోంది

వడ్లు అమ్మి ఐదారు వారాలైంది. రూ.1,43,560  రావాలి. సొసైటీలో అడిగితే రేపు, మాపు అని చెబుతున్నరు. యాసంగిలో పంట వేసేందుకు అప్పు తీసుకొస్తి. మళ్లీ ఇప్పుడు వానకాలంలో విత్తనాలు, ఎరువులు కొనాలి. వడ్ల పైసలు రాక మస్తు తిప్పలైతాంది

– దేశాయిపేట సాయిరాం, చిల్లర్గి

నెల రోజులైంది

95 సంచుల వడ్లు కాంటా పెట్టి నెల రోజులవుతోంది. పైసలు అకౌంట్ల జమ కాలేదు.  ఆఫీసర్లను అడిగితే వస్తామని చెబుతున్నరు. కానీ ఎప్పుడు అనేది లేదు. దుక్కులు దున్నటం,  విత్తనాలు, ఎరువులకు పైసలు అవసరమున్నాయి. తొందరగా వడ్ల పైసలు ఇస్తే బాగుండు.  
– అంబవ్వ, గాలిపూర్