గంగాపూర్ లో రైల్వే పనులను అడ్డుకున్న రైతులు

గంగాపూర్ లో రైల్వే పనులను అడ్డుకున్న రైతులు
  • పరిహారం చెల్లించాలని డిమాండ్

సిద్దిపేట, వెలుగు: పరిహారం చెల్లించకుండా రైల్వే పనులను నిర్వహిస్తుండడంతో ఆగ్రహించిన రైతులు పనులను అడ్డుకుని నిరసన తెలిపిన సంఘటన చిన్నకోడూరు మండలం గంగాపూర్ లో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన రైతుల భూములను రైల్వే లైన్ కోసం సేకరించారు. కొందరు రైతులకు పరిహారం చెల్లించినా మరికొందరివి పలు కారణాలతో  పెండింగ్ లో పెట్టారు. ఈ విషయంపై అధికారుల చుట్టు తిరిగినా పలితం లేకపోవడంతో తమ పరిహారం చెల్లించిన తర్వాతనే పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నీలి భూపతి, మల్లయ్య, బాలవ్వ, రేణుక, మహేందర్ రెడ్డి పనులను అడ్డుకుని నిరసన తెలిపారు.

 వారు మాట్లాడుతూ భూములు సేకరించిన జాబితాలో తమ పేర్లున్నాయని, వాటిని గ్రామ పంచాయతీలో ప్రదర్శించినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని తమకు న్యాయం జరిగే వరకు పనులను సాగనివ్వమని చెప్పారు. విషయం తెలుసుకుని తహసీల్దారు సలీం, ఎస్ఐ సైఫ్ అలీ  రైతులు ఆందోళన చేస్తున్న  ప్రాంతానికి  వెళ్లి కలెక్టర్ తో మాట్లాడి న్యాయం చేస్తామని హామి ఇవ్వడంతో నిరసన విరమించారు.