
శివ్వంపేట, వెలుగు: నక్ష బాటను సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ ఆఫీసర్లను రైతులు అడ్డుకున్నరు. మండలంలోని చిన్న గొట్టిముక్కుల గ్రామ శివారులో బయాన చెరువు పక్క నుంచి నక్షబాటను తీయాలంటూ కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే దరఖాస్తు చేసుకోవడంతో సర్వే చేయడానికి రెవెన్యూ ఆఫీసర్లు రాగా రైతులు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు అన్వర్, కాజామియా, పాషా, అంజత్, పాపయ్య, అశోక్, నర్సింలు, సలీం, గంగారాం మాట్లాడుతూ వందల సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్లో నుంచి నక్ష బాట ఉందంటూ కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఉపాధి హామీలో వేసిన రోడ్డు తన పట్టా భూమిలో ఉందని అంటూ ఆ రోడ్డు తీసేసి నక్షబాట వేస్తానంటూ అధికారులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రాణాలు పోయినా సరే పచ్చని పొలాల్లో నుంచి దారి ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు రవి, నాయకులు అశోక్, భిక్షపతి, నరసింహారెడ్డి రైతులకు మద్దతు తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్ కమలాద్రిని వివరణ కోరగా దరఖాస్తు చేసుకున్నందున నక్షబాటను సర్వే చేయడానికి వెళ్లామన్నారు.