ట్రి‌పుల్‌‌ఆర్‌‌‌‌ సర్వేను అడ్డుకున్న రైతులు.. భూమికి భూమి లేదంటే మార్కెట్‌‌‌‌ రేట్‌‌‌‌ ఇవ్వాలని డిమాండ్‌‌‌‌

ట్రి‌పుల్‌‌ఆర్‌‌‌‌ సర్వేను అడ్డుకున్న రైతులు.. భూమికి భూమి లేదంటే మార్కెట్‌‌‌‌ రేట్‌‌‌‌ ఇవ్వాలని డిమాండ్‌‌‌‌

నర్సాపూర్‌‌‌‌, వెలుగు : మెదక్‌‌‌‌ జిల్లా నర్సాపూర్‌‌‌‌ మండలం రెడ్డిపల్లి వద్ద శనివారం ఆఫీసర్లు చేపట్టిన ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ భూ సర్వేను రైతులు అడ్డుకున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూమి లేదంటే మార్కెట్‌‌‌‌ రేటు ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు సర్వే జరగనిచ్చేది లేదంటూ అక్కడే బైఠాయించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో స్పెషల్‌‌‌‌ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

దీంతో పోలీసులతో భయపెట్టి భూములు తీసుకుంటారా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తమతో చర్చలు జరుపుతూనే మరో వైపు గుట్టుచప్పుడు కాకుండా సర్వే ఎలా చేస్తారంటూ నర్సాపూర్‌‌‌‌ ఆర్డీవో, తహసీల్దార్‌‌‌‌తో వాగ్వాదానికి దిగారు. ప్రజాప్రతినిధులు పెద్ద మొత్తంలో భూములు ఆక్రమించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌కు భూములు ఇచ్చే రైతులకు మాత్రం భూమికి బదులు మరో చోట భూమి ఇచ్చేందుకు చేతులు రావడం లేదా ? అంటూ నిలదీశారు. రైతుల అభిప్రాయాన్ని, డిమాండ్లను ప్రభుత్వానికి పంపుతామని, ఆందోళన విరమించాలని నర్సాపూర్‌‌‌‌ ఆర్డీవో జగదీశ్‌‌‌‌రెడ్డి కోరినా రైతులు వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక సర్వే చేయకుండానే ఆఫీసర్లు వెనుదిరిగారు.