
చినుకు కోసం నెల రోజుల నుంచి ఎదురు చూసిన రైతులు తొలకరి పలకరింపుతో పొలంబాట పట్టారు. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన రెండో రోజే అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతుండడంతో పల్లెల్లో హడావుడి మొదలైంది. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న మెట్ట రైతులు విత్తనాలు వేస్తుంటే మరికొంత మంది ఇప్పుడే దున్నడం మొదలు పెట్టారు. తొలి రోజు వానకే భూమిలో పదును సరిపోవడంతో నారుమళ్లు సైతం సిద్ధమవుతున్నాయి. చాలా జిల్లాల్లో రైతులు పెసర, జనుములు, జీలుగు, పిల్లిపెసర, బొబ్బెర, కందులు, శనగలు, మక్కలు, జొన్నలు, సజ్జ, మినుములు, నువ్వులు, కంది తదితర పంటల విత్తనాలు వేయడం ప్రారంభించారు. వర్షం బాగా పడిన ప్రాంతాల్లో పత్తి విత్తనాలు వేయడం షురువైంది. వర్షాలు ఆలస్యమవడంతో తక్కువ టైంలో చేతికొచ్చే పంటలే వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
సాగు లక్ష్యం.. కోటి12 లక్షల ఎకరాలు
రాష్ట్రంలో సాగు భూమి కోటి 45 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది ఖరీఫ్ సాగు లక్ష్యం కోటి 12 లక్షల ఎకరాలుగా పెట్టుకున్నట్లు వ్యవసాయశాఖ చెబుతోంది. రాష్ట్రంలో సాధారణ సాగు కోటి 8 లక్షల 22 వేల 642 ఎకరాలు. కానీ ఈ సారి వర్షాలు జులై నుంచి విస్తారంగా పడతాయన్న వాతావరణశాఖ అంచనాలతో ఇంతకు మించి సాగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
‘నకిలీ విత్తు’తో దళారుల మోసాలు
ఖరీఫ్‌లో 7.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ అంచనా. 5.60 లక్షల హెక్టార్లకు సరిపడ వరి విత్తనాలు, 20 వేల హెక్టార్లకు జొన్న, 4.44 లక్షల ఎకరాలకు మొక్కజొన్న, 1.33 లక్షల హెక్టార్లకు కందులు, 50 వేల హెక్టార్లకు పెసలు, 31 వేల హెక్టార్లకు మినుములు, 6,700 హెక్టార్లకు వేరుశనగ, 2.66 లక్షల హెక్టార్లకు సోయాబీన్ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే నకిలీ విత్తనాలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. విజిలెన్స్ టీమ్‌లతోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లు, ప్రత్యేక స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినా నకిలీల బెడద తప్పడం లేదు. దళారులు నేరుగా గ్రామాల్లోకే వెళ్లి రైతులను పక్కదారి పట్టిస్తున్నారు.
సిద్ధంగా ఎరువులు
ఈ సారి ఖరీఫ్‌లో 19.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ఇప్పటికే 6 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల్ని క్షేత్ర స్థాయికి పంపించారు. తాజా వర్షాలతో ఎరువుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే కేంద్రం ఎరువులపై సబ్సిడీని ఇప్పటివరకు ప్రకటించలేదు. దీంతో రైతులు ప్రైవేట్ ఏజెన్సీలు, ఫర్టిలైజర్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు.
30.50 లక్షల మందికి ‘రైతు బంధు’
రైతుబంధు కింద ప్రభుత్వం 54.56 లక్షల మంది రైతులకు రూ.6900 కోట్లు విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు 30.50 లక్షల మంది రైతులకు రూ.3000 కోట్లు వారి ఖాతాలో జమైంది. మరో 24లక్షల మందికి అందాల్సి ఉంది. రోజువారీగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి పేర్కొంటున్నారు.
మాఫీ కాక.. అప్పు పుట్టక
ఇప్పటివరకు ప్రభుత్వం రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో బ్యాంకుల్లో రైతులకు రుణాలు రీషెడ్యూల్ కాలేదు. దీంతో బ్యాంకర్లు కొత్తగా అప్పులివ్వడం లేదు. దీంతో ప్రైవేటుగా వడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఇక కౌలు రైతులదీ అదే పరిస్థితి. గత ఖరీఫ్‌లో 42 వేల 494 కోట్ల రూపాయల రుణ లక్ష్యం పెట్టుకున్న బ్యాంకర్లు 77 శాతమే ఇచ్చారు. రబీలో 45.68 శాతం మాత్రమే రుణాలు అందాయి. ఈ ఏడాది రుణ లక్ష్యం రూ.49,740.43 కోట్లని ప్రకటించినా అది పూర్తికావడం అనుమానమే.
అరకోటి ఎకరాల్లో పత్తి..
ఈ సారి పత్తి 50 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు 42 లక్షల72 ఎకరాలు. 2018 ఖరీఫ్‌లో 44 లక్షల 93వేల 337 ఎకరాలు సాగైంది. సాధారణ సాగు కంటే 2 లక్షల 93 వేల 265 ఎకరాలు ఎక్కువ సాగైందన్నమాట. ఈ సారి అరకోటి ఎకరాల్లో పత్తి పంట సాగయ్యే అవకాశముందని అధికారుల అంచనా.
30 లక్షల ఎకరాల్లో వరి..
వరి సాధారణ సాగు విస్తీర్ణం 23 లక్షల75 వేల 80 ఎకరాలు. గత ఖరీఫ్‌లో 26 లక్షల 38 వేల 742 ఎకరాల్లో సాగైంది. సాధారణ సాగు కంటే ఇది 2 లక్షల 63 వేల 662 ఎకరాలు అదనం. తాజాగా కాళేశ్వరం నీరు అందుబాటులోకొస్తే ఈ ఖరీఫ్‌లో 30 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశముందని అంటున్నారు.