పులి, సింహం గాండ్రింపులు.. అడవి పందుల పరార్

పులి, సింహం గాండ్రింపులు.. అడవి పందుల పరార్
  •     పంటను కాపాడుకునేందుకు వినూత్న ఆలోచన

బజార్ హత్నూర్, వెలుగు: అడవి జంతువుల బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. రాత్రి వేళల్లో చేనుకు వెళ్లకుండా పంటలను రక్షించుకుంటున్నారు. బజార్ హత్నూర్ మండలంలోని దేగాం, గిర్నూర్, పిప్రీ, బలాన్పుర్ తదితర గ్రామాల్లోని రైతులు సౌండ్ రికార్డింగ్ మైక్ సిస్టమ్ ను పంట చేనులో పెట్టి అడవి పందుల రాకను అరికడుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.800కు ఛార్జింగ్ సిస్టం ఉన్న మైకులు లభిస్తున్నాయి. వీటిల్లో పులి, సింహం గాండ్రింపులు, కుక్కల అరుపులను రికార్డ్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో పంట చేనుల్లో బిగిస్తున్నారు. ఆ గాండ్రింపులు, అరుపులు విన్న పందులు, ఇతర అడవి జంతువులు ఆ ప్రదేశం  నుంచి పరారవుతున్నాయి. ఈ ప్రయత్నంతో రాత్రి వేళల్లో చేనుల్లోకి కావలి వెళ్లడం తప్పిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.