
- ..త్వరలో నిపుణులతో చర్చ..మంత్రి ఉత్తమ్‌కు ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం పాలసీ రూపొందించేందుకు రైతు కమిషన్ సిద్ధమైంది. ఈ మేరకు శనివారం సెక్రటేరియెట్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ సమావేశమై, ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చింది. చెరువుల పరిరక్షణ పాలసీపై నిపుణులతో చర్చించేందుకు త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ సమావేశానికి హాజరుకావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో చెరువులు, కుంటల పరిరక్షణ, గ్రౌండ్ వాటర్ స్థాయిల పెంపునకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రతో కమిషన్ చర్చించింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీటి సంఘాల ద్వారా రైతులు గ్రామీణ స్థాయిలో చెరువులను కాపాడుకున్న విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది. అయితే, గత దశాబ్దంలో చెరువులు, కుంటలు కబ్జాదారుల చేతిలో అన్యాక్రాంతమై, క్యాచ్‌మెంట్ ఏరియాల్లో కాల్వలు దెబ్బతినడం, కొన్ని మాయమవడం వంటి సమస్యలు తలెత్తాయని తెలిపింది.
దీంతో చెరువులు కుంచించుకుపోవడం, గ్రౌండ్ వాటర్ స్థాయిలు పడిపోవడం జరిగిందని కమిషన్ వివరించింది. మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణకు వెంటనే నీటి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రికి సూచించింది. ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటు సభ్యులు రాములు నాయక్, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.