మంచిప్ప రిజర్వాయర్ ఖర్చెక్కువ..సాగు తక్కువ

మంచిప్ప రిజర్వాయర్ ఖర్చెక్కువ..సాగు తక్కువ

నిజామాబాద్ : కాళేశ్వరం 21, 22 ప్యాకేజీల్లో భాగంగా నిర్మించిన మంచిప్ప రిజర్వాయర్ ను కెపాసిటీ పెంచే నెపంతో రీ డిజైన్​ చేయడంతో వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. సుమారు రూ.350 కోట్ల ఖర్చుతో అయిపోయేది మరో రూ.3250 కోట్లు ఎక్స్​ట్రా పెట్టాల్సి వస్తున్నది. ఇంత పెట్టినా ప్రయోజనం ఏమన్నా ఉందా అంటే కేవలం 60 వేల ఎకరాలకు మాత్రమే అదనంగా సాగునీరు అందనున్నది. ఈ ప్రాజెక్టు పనులను కూడా ప్రభుత్వం మేఘా కంపెనీకి అప్పజెప్పింది. 

2007లో ప్రాణహిత – చేవెళ్ల షురూ  :-
2007లో అప్పటి వైఎస్​ సర్కారు ప్రాణహిత–-చేవెళ్ల కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 21,22 ప్యాకేజీలను చేపట్టింది. ఇందులో భాగంగా సొరంగ మార్గం పనులను పూర్తి చేసింది. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పై ఆధారపడి నిర్మించిన ఈ ప్యాకేజీల ద్వారా నిజామాబాద్, జగిత్యాల , కామారెడ్డి, మెదక్​ జిల్లాల పరిధిలో 4 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. 21 ప్యాకేజీ కింద నిజామాబాద్​ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల వరకు1.84 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్లాన్లు తయారు చేస్తే రీ డిజైన్​లో 2 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. 22వ ప్యాకేజీ కింద పాత డిజైన్​లో కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో 1.56 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు ఇవ్వాలనుకోగా, రీ డిజైన్​లో 2 లక్షల ఎకరాలకు పెంచారు. మొత్తంగా రెండు ప్యాకేజీల కింద రీ డిజైన్​లో 60 వేల ఎకరాల సాగు విస్తీర్ణం మాత్రమే పెరిగింది.  


రీ డిజైన్​తో ఖజానాపై రూ. 3500 కోట్ల భారం :-
కాళేశ్వరం 21, 22 ప్యాకేజీల రీ డిజైన్​తో ప్రభుత్వంపై రూ.3500 కోట్ల భారం పడుతోంది. అప్పటి సర్కారు ప్రాణహిత –చేవేళ్ల స్కీం కింద 0.375  టీఎంసీల ప్రాజెక్టు అనుకొని రూ. 330 కోట్ల అంచనా వ్యయం అవుతుందని భావించారు. కానీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం 21,22 ప్యాకేజీ పనుల్లో మార్పులు చేశారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 3.5 టీఎంసీలుగా మార్చి  మంచిప్ప కొండెం చెరువును రిజర్వాయర్​ చేస్తామని ప్రకటించారు. దీంతో అమ్రాబాద్​ పరిధిలో 4 తండాలు , బైరాపూర్​ పరిధిలో 4 తండాలు, మంచిప్ప పరిధిలో మంచిప్ప, మంచిప్ప తండా ఇలా పది గ్రామాలు నీటమునుగుతున్నాయి. సుమారు12 వేల మంది నిరాశ్రయులవుతున్నారు. పది గ్రామాల్లోని 1388 ఎకరాల వ్యవసాయ భూములు, 800 అటవీ శాఖ భూములు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో నష్టపరిహారం కింద ఎకరానికి రూ. 10 లక్షల చొప్పున సుమారు 1300 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది.  

పరిహారం ఎంతో చెప్పని సర్కారు  :-
మోపాల్ మండలంలో మొదటి విడతలో 2008 లోనే 150 ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లోనే ఎకరాకు రూ.5 లక్షల వరకు పరిహారం చెల్లించారు. ప్రస్తుతం మంచిప్పలో ఎకరం రూ.50 లక్షల నుంచి రూ. కోటి వరకు పలుకుతోంది. కానీ ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తామో చెప్పడం లేదు. మంచిప్ప రిజర్వాయర్ 3.5 టీఎంసీలుగా అప్ గ్రేడేషన్ కోసం అమ్రాబాద్, బైరాపూర్, మంచిప్ప గ్రామాల నుంచి 1,336 ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. మరో 788 ఎకరాల అటవీ భూమి కోసం ఆ శాఖ క్లియరెన్స్ ఇచ్చేసింది. 21వ ప్యాకేజీలో అమ్రాబాద్​ వాటర్​ ఇన్​కమింగ్​ పంప్​హౌస్​పనులు పూర్తయ్యాయి. బైరాపూర్​ పంప్​హౌస్ ​నిర్మాణపనులు జరుగుతున్నాయి. 


ముంపువాసుల  ఆందోళన బాట :-
ఒకవైపు మంచిప్ప రిజర్వాయర్​కట్ట ఎత్తు పను లు కొనసాగుతుండగా నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. ఏ మేరకు భూములు కోల్పోతారో చెప్పకుండా అధికారులు పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. గత నెల రిజర్వాయర్ నిర్మాణ పనులు అడ్డుకున్నారు. ఈనెల 21న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో అడిషనల్ కలెక్టర్ ను నిలదీశారు. 26న రీడిజైన్ పనులను నిలిపివేయాలని గడ్కోల్​పంప్ హౌస్ నిర్మాణ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య పనులు కొనసాగిస్తున్నారు. 28న మంపు గ్రామాల కమిటీ ప్రతినిధులు కలెక్టరేట్​ఎదుట నిరసన తెలిపారు. రీ డిజైన్ డీపీఆర్​ ​బహిర్గత పరిచేవారకు పోరాటం చేస్తామని భూనిర్వాసితుల కమిటీ హెచ్చరించింది.  

 

కొత్త డిజైన్​తో కోట్లు కొల్లగొడుతున్నరు :-
రిజర్వాయర్ రీడిజైన్ తో ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్లు మాయమవుతున్నాయి. రిజర్వాయర్​ నిర్మాణానికి రూ. 2200 కోట్లు , భూముల పరిహారం కింద రూ 1300 కోట్ల ప్రజాధనం వేస్ట్​చేస్తున్నారు. పాత డిజైన్​తో ఇంచు భూమి కూడా ముంపునకు గురికాకుండే.  ఏడాదిలో రెండు పంటలు వచ్చే సాగు  భూములు పోతే బతుకుడు ఎట్లా ? అని ముంపు గ్రామాల  కమిటీ గౌరవ ప్రెసిడెంట్​ శంకర్ నాయక్ ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే మంచిప్ప రీడిజైన్​ చేసిన్రు. కమిషన్ల కోసమే కెపాసిటీ పెంచిన్రు . పది గ్రామాల ముంపుతో పాటు సాగుభూములు  కోల్పోవాల్సి వస్తోంది. నష్టపరిహారం కూడా కరెక్ట్​ ఇవ్వడం లేదు. పరిహారం కంటే భూముల రేట్లు పదింతలు ఎక్కువుందని ముంపు గ్రామాల కమిటీ ప్రెసిడెంట్ గొల్ల శ్రీనివాస్  తెలిపారు.

 మరిన్ని వార్తల కోసం : -
కేసీఆర్ కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైసలు ఇస్తలే.. ఏడాదిన్నరగా ఆగిన పంపిణీ

కేఆర్‌‌ఎంబీ సమావేశం.. మళ్లీ హాజరుకాని తెలంగాణ