
- కేసీఆర్ కిట్ పైసలు ఇస్తలే
- ఏడాదిన్నరగా ఆగిన పంపిణీ
- కేవలం కిట్లకే పరిమితమవుతున్న సర్కార్
- 4.5 లక్షల మందికి
- రూ.550 కోట్ల బకాయిలు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ పథకం అమలు మసకబారుతోంది. కేవలం కిట్ల పంపిణీకే సర్కార్ పరిమితమవుతోంది. ఈ స్కీమ్‌లో భాగంగా ఇచ్చే నగదు పంపిణీ ఆగిపోయింది. కొన్ని జిల్లాల్లో ఏడాదిన్నరగా, మరికొన్ని జిల్లాల్లో ఏడాదిగా డబ్బులు పంపిణీ చేయడం లేదు. గతంలో ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడైతే రూ.12 వేల చొప్పున సర్కారు ఇచ్చేది. ఫస్ట్ యాంటి నాటల్ చెకప్ నుంచి బిడ్డ పుట్టిన 9 నెలల్లోపు 4 దఫాల్లో ఈ మొత్తాన్ని తల్లి అకౌంట్‌లో జమ చేసేవారు. రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల మంది తల్లులు ఇప్పుడీ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. వీళ్లందరికీ కలిపి సుమారు రూ.550 కోట్లు ఇవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదల చేయాలని సర్కార్ దృష్టికి తీసుకుపోయినా ఫలితం ఉండడం లేదని చెబుతున్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహార పంపిణీ జరుగుతున్నప్పుడు, మీది నుంచి ఈ డబ్బులు పంపిణీ చేయాల్సిన అవసరం ఏంటని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారని, దీన్ని బట్టి కిట్ల పంపిణీకే స్కీమ్‌ను పరిమితం చేసే సూచనలు కనిపిస్తున్నాయని క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు చెబుతుండడం గమనార్హం. అయితే కేసీఆర్ కిట్ డబ్బులు పంపిణీ అనేది కేవలం పౌష్టికాహారం కోసమే కాదని, గర్భం దాల్చిన తర్వాత పేద మహిళలు కూలి పనులకు పోకూడదన్న ఉద్దేశం కూడా ఇందులో ఉందని సీఎం కేసీఆర్ పలుమార్లు తన ప్రసంగాల్లో చెబుతూ వచ్చారు.
హెల్త్ వర్కర్లతో జగడం : -
కేసీఆర్ కిట్ డబ్బులు నిలిపివేత ప్రభావం క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ వర్కర్ల మీద పడుతోంది. కేసీఆర్ కిట్ రిజిస్ర్టేషన్ బాధ్యతలన్నీ ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలే చూసుకుంటున్నారు. గర్భిణుల వివరాలన్నీ వీళ్లే పోర్టల్‌లో ఎంటర్ చేస్తున్నారు. దీంతో డబ్బులు రాకపోతే గర్భిణులు, వాళ్ల కుటుంబ సభ్యులు హెల్త్ వర్కర్లనే నిలదీస్తున్నారు. కొంత మందికి ఒకట్రెండు కిస్తీలు వచ్చి ఆ తర్వాత ఆగిపోయాయి. దీంతో కావాలనే ఆశా కార్యకర్తలు తమకు డబ్బులు రాకుండా చేస్తున్నారని జౌడానికి దిగుతున్నారు. ఇంకొంత మందైతే తమకు రావాల్సిన డబ్బులు నొక్కేశారని ఊళ్లలో అంటున్నారని ఆశలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కిట్ డబ్బులు నిలిపివేసినట్టు ప్రభుత్వం అధికారికంగా చెప్పనంత వరకు లేదా డబ్బులు పంపిణీ చేసే దాకా తమకు ఈ తిప్పలు తప్పేలా లేవని ఆందోళన చెందుతున్నారు.
పైసా రాలె : -
నా భార్యకు మొదట్నుంచి గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే చూయించాం. డెలివరీ కూడా గోదావరిఖని ఏరియా హాస్పిటల్‌లో చేయించాం. ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్.. అన్నీ ఇచ్చినం. రిజిస్ర్టేషన్ అయింది. డబ్బులు వస్తయని చెప్పారు. బిడ్డ పుట్టి 8 నెలలు అయితున్నా ఇప్పటివరకూ ఒక్కపైసా కూడా రాలేదని పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మామిడి సంతోష్ తెలిపాడు. మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెండేళ్ల కిందట డెలివరీ చేయించుకున్న. ఆడబిడ్డ పుట్టింది. ఇయ్యాల్టికీ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందలేదు. ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ని అడిగితే.. ‘ఆన్‌లైన్ చేసి పంపించాం.. బడ్జెట్ రాగానే అకౌంట్‌లో డబ్బులు పడుతయి’ అని చెబుతున్నరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం ఇప్పించాలని సూర్యాపేట జిల్లాకు చెందిన వల్లోజు రేణుక తెలిపింది.
మరిన్ని వార్తల కోసం : -
450 ఎంబీబీఎస్.. 150 పీజీ సీట్ల రద్దు
తెలంగాణ, ఏపీ నుంచి 40 మందికి ర్యాంకులు