వడ్లు కొంటలేరంటూ సీఎం సొంత ఇలాకాలో రైతుల ఆందోళన

వడ్లు కొంటలేరంటూ సీఎం సొంత ఇలాకాలో రైతుల ఆందోళన

సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్​లో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు సెంటర్‌‌‌‌కు వడ్లు తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనకపోవడాన్ని నిరసిస్తూ గంట పాటు రాస్తారోకో చేశారు. రేయింబవళ్లు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిని అడిగితే గన్నీ బ్యాగులు లేవని, రైస్​మిల్లర్లు టైమ్‌‌కు అన్​లోడ్ చేసుకోవడం లేదని చెప్తున్నారని వాపోయారు.

గజ్వేల్‌లో రోడ్డెక్కిన రైతన్నలు

జగదేవపూర్ (వెలుగు): సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండల కేంద్రంలో రైతన్నలు రోడ్డెక్కారు. కొనుగోలు సెంటర్‌‌కు వడ్లు తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనకపోవడాన్ని నిరసిస్తూ గంట పాటు రాస్తారోకో చేశారు. కొనుగోళ్లు లేటవుతుండడంతో రేయింబవళ్లు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిని అడిగితే గన్నీ బ్యాగులు లేవని, రైస్​మిల్లర్లు టైమ్‌కు అన్​లోడ్ చేసుకోవడం లేదని చెప్తున్నారని వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయిందని, త్వరలో వర్షాలు ప్రారంభం కానున్నాయని, వెంటనే కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారం రోజులుగా కాంటాలు బంద్​పెట్టారని చెప్పారు. గన్నీ బ్యాగులు తెచ్చి కొనుగోళ్లు స్టార్ట్​ చేయాలన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్ఐ హరీశ్ గౌడ్ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బెదిరించే ప్రయత్నం చేశారు. వెనక్కి తగ్గని రైతులు.. కొనుగోళ్లపై హామీ వచ్చేదాకా రోడ్డుపైనే ఉంటామని స్పష్టం చేశారు. స్థానిక బీజేపీ నాయకులు రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. కొనుగోళ్లు స్పీడప్ చేస్తామని ఏవో నాగేందర్ రెడ్డి హామీ ఇవ్వడం, 3 వేల గన్నీ బ్యాగులు తెప్పిస్తున్నామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. 

చంపేస్తామంటూ ఫోన్లు

సీఎం ఫామ్‌హౌస్‌కు దగ్గర్లో ధర్నా జరగడం తెలియడంతో స్థానిక బీఆర్ఎస్ లీడర్లు రంగంలోకి దిగారు. ఓ బీఆర్ఎస్ నేత.. ఒకరిద్దరు రైతులకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ‘ఇంకోసారి ఇలాంటి ధర్నాలు చేస్తే చంపేస్తా’ అని హెచ్చరించినట్లు తెలిసింది.