కోల్డ్ స్టోరేజీలు కావాలె..రైతుల డిమాండ్

కోల్డ్ స్టోరేజీలు కావాలె..రైతుల డిమాండ్

రాష్ట్రంలో కోల్డ్​ స్టోరేజీల కొరత కనిపిస్తోంది. కష్టపడి పండించిన పంటలను గిట్టుబాటు ధర రానప్పుడు నిల్వ చేసుకుని, ధర పెరిగాక అమ్ముకునేందుకు వీలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్​ శాఖ పరిధిలో ఒక్క కోల్డ్​ స్టోరేజీ కూడా లేని పరిస్థితి. ప్రైవేటులో కోల్డ్​ స్టోరేజీలు ఉన్నా.. కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, చార్జీలు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలున్నాయి. ప్రైవేటులో ఉన్న 124 కోల్డ్‌‌ స్టోరేజీలు కూడా 14 జిల్లాల్లోనే ఉన్నాయి. మిగతా 17 జిల్లాల్లో ఒక్కటి కూడా లేదు. దీంతో రైతులు తమ పంటలను వచ్చిన ధరకు అమ్మేసుకోవాల్సి వస్తోంది.

రేట్లపై కంట్రోల్​ కూడా..

పంటల దిగుబడి ఎక్కువగా వచ్చినప్పుడు ధరలు ఒక్కసారిగా పడిపోవడం, లేకపోతే చుక్కలను తాకడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. తక్కువ ధరకు అమ్మలేక తిరిగి ఇంటికి తీసుకొని పోలేక కొన్నిసార్లు కూరగాయలను మార్కెట్‌‌లోనే పారబోస్తున్నారు. ఇంకొందరు రైతులైతే పంటను తెంపకుండా అలాగే వదిలేస్తున్నారు. కోల్డ్​ స్టోరేజీలను ఏర్పాటు చేస్తే.. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు అవకాశం ఉంటుంది. కూరగాయలు, ఉల్లిగడ్డ వంటి వాటిని నెల రోజుల నుంచి మూడు నెలల వరకు స్టోర్​ చేసుకుని.. ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. దీనివల్ల అటు రైతులకు లాభం కలగడంతోపాటు.. మార్కెట్లో ధరలు అడ్డగోలుగా పెరగడం, పడిపోవడాన్ని నియంత్రించవచ్చు. దీనివల్ల వినియోగదారులకూ లాభమే.

మిర్చి పంటతో..

రెండేళ్ల కింద మిర్చి దిగుబడి బాగా పెరగడంతో ధర పడిపోయింది. క్వింటాల్​ రూ.4 వేలకు, ఓ దశలో అయితే రూ.2 వేలకు కూడా తగ్గింది. దాంతో కొందరు రైతులు ప్రైవేటు కోల్డ్‌‌ స్టోరేజీల్లో నిల్వ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయంగా మిర్చికి డిమాండ్‌‌ పెరింది. చైనా, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో మిర్చి నుంచి నూనె తీసి ఆహారంగా, ఇతర అవసరాలకు, రసాయనాల్లో వినియోగిస్తుంటారు. అక్కడ మిర్చి ఆయిల్‌‌ కొరత ఏర్పడి, వేరే దేశాల నుంచి కొనుగోలు చేయడంతో రేటు అమాంతం పెరిగి క్వింటాల్‌‌ ధర రూ.10 వేలకు చేరింది. తరువాత మళ్లీ తగ్గుతూ వచ్చింది. కోల్డ్​ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్న రైతులు మిర్చిని క్వింటాల్​కు రూ. 9 వేల నుంచి రూ.10 వేల లెక్కన అమ్ముకోగలిగారు. తర్వాత ఈ ఏడాది సాగుచేసిన పంట రావడంతో మళ్లీ రేటు పడిపోయింది.

ఫుడ్‌‌ ప్రాసెసింగ్​లోనూ కీలకమే

రాష్ట్రంలో ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ రంగానికి ప్రాధాన్యత కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆహార పంటలు, పండ్లు, కూరగాయలు, ప్రాసెసింగ్‌‌ చేయడం ద్వారా రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న పండ్లు, కూరగాయల్లో ఐదుశాతానికి మించి ప్రాసెసింగ్ జరగడం లేదు. దీన్ని బాగా పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఈ ఫుడ్​ ప్రాసెసింగ్​లో కోల్డ్‌‌ స్టోరేజీలే కీలకం. కానీ ప్రభుత్వం ఆ దిశగా దృష్టి పెట్టలేదు.

సాధారణ గోడౌన్లు పెరిగినయ్

రాష్ట్రంలో గత ఐదేళ్లలో సాధారణ గోడౌన్​ల సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్ర ఏర్పాటు నాటికి 179 గోడౌన్లలో కలిపి నాలుగు లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రం ఉంటే.. ఇప్పుడది 356 గోడౌన్లతో 17 లక్షల టన్నులకు చేరింది. ఇదే తరహాలో కోల్డ్‌‌ స్టోరేజీలనూ పెంచాలని రైతులు కోరుతున్నారు.