రుణమాఫీ కాకపోవడంతో రైతుల ఇబ్బందులు

రుణమాఫీ కాకపోవడంతో రైతుల ఇబ్బందులు

పాత అప్పు చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామంటున్న బ్యాంకర్లు
రూ.25 వేల లోపు మాత్రమే మాఫీ చేసిన ప్రభుత్వం
జయశంకర్‌ భూపాలపల్లి, వెలుగు: వ్యవసాయాన్నే నమ్ముకొని జీవించే వారికి అప్పు ఇచ్చేవారు కరువయ్యారు. వానాకాలం సీజన్ షురూ కావడంతో పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు అరిగోస పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్‌ రూ.25 వేల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేశారు. దీంతో వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కేవలం 60 వేల మంది రైతులకు మాత్రమే మేలు జరిగింది. ఇంకా రూ.25 వేల నుంచి రూ.లక్ష లోపు పంట రుణాలున్న3 లక్షల మందికి పైగా రైతులు బ్యాంకుల్లో చేసిన అప్పులు తీర్చలేక.. కొత్తగా అప్పు పుట్టక నరకయాతన అనుభవిస్తున్నారు. బంగారు, వెండి వస్తువులు తాకట్టు పెడ్డడమో లేక నివసించే ఇల్లు కుదువ పెట్టో ప్రైవేట్‌ వడ్డీవ్యాపారుల దగ్గర‍ అప్పులు తీసుకొచ్చి పంట సాగు చేసుకుంటున్నారు.

రూ.25 వేల లోపు పంట రుణాలే మాఫీ..

రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల టైంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఏప్రిల్‌1, 2014 నుంచి డిసెంబర్‌11, 2018 లోపు బ్యాంకుల్లో తీసుకున్న వ్యవసాయ పంట రుణాలకు ఇవి వర్తిస్తాయని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక 2020‒21 రాష్ట్ర బడ్ట్‌జె లో రూ.25 వేల లోపు పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తూ ఫండ్స్ కేటాయించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 వేల మంది రైతుల ఖాతాలలో నేరుగా రూ.150 కోట్ల వరకు వేశారు. ఇంకా రూ.25 వేల నుంచి రూ.లక్ష లోపు పంట రుణాలు కలిగిన రైతులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఉన్నారు. ఈ రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా రూ.500 కోట్లకు పైగా జమ చేయాల్సి ఉంది. నాలుగు విడతల్లో ఈ డబ్బులు చెల్లిస్తా మని బడ్ట్‌జె టైంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. పంట రుణమాఫీ కోసం రూ.6 వేలు కోట్లు కేటాయించినట్లు ప్రకటించినా రూ.25 వేలకు పైగా బ్యాంకు అప్పులున్న రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు.

పెరిగిన సాగు ఖర్చులు

వ్యవసాయ సాగు ఖర్చులు ఏటేటా భారీగా పెరిగిపోతున్నాయి. గతంలో కలుపుకు వచ్చే ఆడ కూలీలకు రోజుకు రూ.150 ఇవ్వగా ఇప్పుడు రూ.200, వరినాట్లకు అయితే రూ.300 తీసుకుంటున్నారు. మగ కూలీకి రూ.400 ఉంటే ఇప్పుడు రూ.500 దాటింది. దుక్కి దున్నే ట్రాక్ట‌ర్ కిరాయిలు, ఎడ్లతో కొట్టే గుంటుకల, గొర్రు ఖర్చు కూడా రూ.1,000కి పైగా పెరిగింది. ఇవే కాకుండా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు కూడా పెరిగాయి. రైతు బంధు పేరిట ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున సాయం అందిస్తున్నా ఇవి సరిపోవడం లేదు. వరి, పత్తి, పసుపు తదితర పంటల సాగుకు ఎకరానికి రూ.25 వేలకు పైగా ఖర్చు అవుతున్నట్లుగా రైతులు చెబుతున్నారు.

కౌలు రైతులపై భారం

ఉమ్మడి జిల్లాలో 30 వేల మందికి పైగా కౌలు రైతులున్నారు. ఎకరానికి రూ.7 వేల నుంచి రూ.15 వేలు చెల్లించి భూమిని కౌలుకు తీసుకొని వీళ్లు పంట సాగు చేస్తున్నారు. వీరికి రైతుబంధు సాయం కూడా అందదు. పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. పంట కౌలుకు తీసుకొని ఏడాదంతా భార్య బిడ్డలతో శ్రమించినా రూ.30 వేలు కూడా మిగలడం లేదు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు వస్తే ఈ రూ.30 వేలతో పాటు పంట పెట్టుబడి కూడా నష్టపోవాల్సి వస్తోంది.

అప్పు చెల్లిస్తేనే రుణం ఇస్తామంటున్నారు..!

నాకు నాలుగు ఎకరాల భూమి ఉండగా రెండేళ్ల క్రితం మొగుళ్లపల్లి ఎస్బీఐలో రూ.1.20 లక్షల క్రాప్ లోన్ తీసుకున్నా. పంటలు సరిగా పండక ఇప్పటివరకు కట్ట లేదు. ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు. దీంతో తీసుకున్న రుణాలకు వడ్డీ పెరుగుతూనే ఉంది.
– మాల్సాని రాజేశ్వర రావు, మొగుళ్లపల్లి , భూపాలపల్లి

పైసలు లేక కష్ట మవుతోంది..

పంట సాగుకు చేతుల్లో పైసలు లేవు. వరి నాట్లు వేసే సీజన్ వచ్చింది. బ్యాంకుల్లో కొత్త పంట రుణాలు ఇవ్వడం లేదు. తీసుకున్న అప్పు మాఫీ కాలేదు అని అంటున్నారు. కరోనా కష్ట కాలంలో బయట అప్పులు పుట్టడం లేదు. పెట్టుబడి భారంగా ఉంది.

– గుండారపు మహేందర్‌, శాయంపేట , వరంగల్ రూరల్

మ‌రిన్ని వార్త‌ల కోసం..