వడ్లు అమ్మేందుకు రైతుల అరిగోస

వడ్లు అమ్మేందుకు రైతుల అరిగోస
  • మిల్లర్లు సర్టిఫై చేస్తేనే కొనుగోళ్లు
  • సవాలక్ష కొర్రీలతో శాసిస్తున్నరు
  • వ్యాపారుల చేతుల్లో రైతుల బతుకులు
  • రాష్ట్ర సర్కారు రూల్స్‌‌తో ఇబ్బందులు

వడ్లు అమ్ముదామని వెళ్తున్న రైతులకు రైస్​ మిల్లర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న వడ్లను మిల్లులకు తీసుకెళ్తే సవాలక్ష రూల్స్‌‌తో వెనక్కి పంపుతున్నారు. వ్యాపారులు ఓకే చెప్తేగానీ వడ్ల పైసలు రైతుల చేతికి వచ్చే పరిస్థితి లేదు. ‘వడ్లు మంచిగా లేవు.. గట్టిగా లేవు.. సరిగా ఎండలేదు.. నూకలు అయితున్నయ్..’ ఇలా నోటికొచ్చిన కొర్రీ పెడుతూ మద్దతు ధరలో కోత పెడుతున్నారు. ఎప్పుడు లేనివిధంగా తేమ శాతంపై  సర్కారు పెట్టిన కొత్త రూల్స్‌‌ కారణంగా మిల్లర్లు తమను శాసిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

పండించిన పంటను అమ్ముకుందామని వెళ్తున్న రైతులకు మిల్లర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్తే సవాలక్ష రూల్స్ తో వెనక్కి పంపుతున్నారు. వ్యాపారులు ఓకే అంటేగానీ వడ్ల పైసలు రైతుల చేతికి వచ్చే పరిస్థితి లేదు. ‘వడ్లు మంచిగా లేవు.. గట్టిగా లేవు.. సరిగా ఎండలేదు.. నూకలు అయితున్నయ్..’ ఇలా నోటికొచ్చింది చెబుతూ  మద్దతు ధరలో కోత పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సర్కారు పెట్టిన కొత్త నిబంధన కారణంగా మిల్లర్లు తమను శాసిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ​

దిగుబడి 60లక్షల మెట్రిక్​ టన్నులు

రాష్ట్రంలో  వానకాలం వరి సాధారణ సాగు విస్తీర్ణం 9,64,548 హెక్టార్లుకాగా, ఈ ఖరీఫ్​లో అనూహ్యంగా 13, 32, 551హెక్టార్లలో సాగైంది. దాదాపు అన్ని జిల్లాల్లో వరి కోతలు పూర్తికావచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన ఆఫీసర్లు 3,327 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. కొన్నిచోట్ల తప్ప అన్ని ప్రాంతాల్లోనూ ఐకేపీ సెంటర్లు తెరిచారు. ఆయా కేంద్రాలకు ప్రతిరోజూ వందలాది వాహనాలు ధాన్యం లోడ్​లతో క్యూ కడుతున్నాయి.

తేమ, తరుగు పేరిట కోతలు..

మిల్లర్లు చెప్పినట్లు కాంటా పెట్టి తెచ్చిన ధాన్యాన్ని వెనక్కి తీసుకెళ్తే మరోసారి రవాణా, హమాలీల భారం పడుతుందని భావిస్తున్న రైతులు కాళ్లావేళ్లా పడుతున్నారు. దీంతో చాలాచోట్ల వ్యాపారులు మద్దతు ధరలో కోతపెట్టి తీసుకుంటున్నారు. ప్రభుత్వం గ్రేడ్ ఏ రకానికి రూ. 1835, కామన్ రకానికి రూ.1815 ధర నిర్ణయించగా,  రూ.1500 నుంచి రూ.1600 మాత్రమే చెల్లిస్తున్నారు. కరీంనగర్​లాంటి జిల్లాల్లో ప్రతి క్వింటాల్​కు సుమారు 8 నుంచి 10 కిలోల దాకా కోత పెడుతున్నారు. ఫలితంగా ప్రతి క్వింటాల్​కు రూ. 180దాకా కోల్పోతున్నామనీ, ఇక మద్దతు ధర పెంచి ఏమి లాభమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కరీంనగర్​ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని నర్సింగాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేసినా, వడ్లు బాగా లేవంటూ మిల్లర్లుతప్పిపంపారు. దీంతో రైతులు రాస్తారోకో చేసి, వడ్లను తగలబెట్టేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. ఇలా రోజుకో చోట ఆందోళన జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ప్రభుత్వ నిబంధనతో మిల్లర్ల పెత్తనం..

17 శాతంలోపు తేమ ఉంటేనే ధాన్యం కొంటామని ప్రకటించిన సర్కారు, ఈసారి కొత్త నిబంధన తెచ్చింది. వడ్ల నాణ్యతపై రైస్​మిల్లర్లు ఓకే అంటేనే  ఖాతాల్లో నగదు జమచేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో రైతులను మిల్లర్లు శాసిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి, ట్రాక్టర్లతో తరలించాక రైస్​మిల్లర్లు గేటు వద్దే అడ్డుకుంటున్నారు. వడ్లు గట్టిగా లేవు. తాలు ఎక్కువగా ఉంది. నల్ల గింజలున్నాయి. తేమ ఉంది. నూకలవుతాయి.’ ఇలా ఏదో ఒక సాకు చెప్పి తిప్పి పంపిస్తున్నారు.

కొర్రీలు పెడుతున్నరు..

నాకున్న నాలుగెకరాల్లో వరి పంట వేసిన. పంట చేతికందే టైంటో వానలు పడి దిగుబడి తగ్గింది. మిగిలిన పంటను ఐకేపీ సెంటర్​లో అమ్మితే మిల్లుకు పంపారు. అక్కడ వ్యాపారులు అడ్డుకొని ప్రతి బస్తాకు తేమ పేరిట రెండు కిలోలు, తరుగు పేరిట రెండు కిలోలు కోత పెట్టారు. ఇదేందని అడిగితే ‘ఇష్టం లేకుంటే వెనక్కి తీస్కపో’ అంటూ నిర్లక్ష్యంగా చెప్పారు.  గతంలో ఎన్నడూ ఇట్ల లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకొని మా లాంటి రైతులకు న్యాయం చెయ్యాలె.

– మడుగూరి సమ్మిరెడ్డి, రైతు, నర్సింగాపూర్