పాల ఇన్సెంటివ్‌‌ ఎప్పుడొస్తదో ?.. ఉమ్మడి వరంగల్‌‌ జిల్లా పరిధిలో రూ. 4 కోట్లు పెండింగ్‌‌

పాల ఇన్సెంటివ్‌‌ ఎప్పుడొస్తదో ?.. ఉమ్మడి వరంగల్‌‌ జిల్లా పరిధిలో రూ. 4 కోట్లు పెండింగ్‌‌
  • 2020 ఏప్రిల్‌‌ నుంచి నిధులివ్వని బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం
  • కాంగ్రెస్‌‌ సర్కారైనా ఇన్సెంటివ్‌‌ విడుదల చేయాలని కోరుతున్న రైతులు

మహబూబాబాద్‌‌‌‌, వెలుగు : పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్‌‌ కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో 2017లో అప్పటి ప్రభుత్వం ఇన్సెంటివ్‌‌ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రతి లీటర్‌‌కు రూ. 4 చొప్పున ప్రోత్సహకం ఇవ్వాలని నిర్ణయించారు. 2020 ఏప్రిల్‌‌ వరకు నిధులను సక్రమంగానే విడుదల చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నిధుల విడుదలను ఆపేసింది. నాలుగేళ్లుగా ఫండ్స్‌‌ రిలీజ్‌‌ కాకపోవడంతో బకాయిలు భారీ స్థాయిలో పేరుకుపోయాయి.

రూ. 4 కోట్లు పెండింగ్‌‌

ఉమ్మడి వరంగల్‌‌ జిల్లా పరిధిలోని సుమారు 8,250 మంది పాడి రైతులు నిత్యం విజయ డెయిరీకి పాలు పోస్తున్నారు. జిల్లాలోని తొర్రూరు, మహబూబాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌, నర్సంపేట, సంగెం, ధర్మసాగర్‌‌‌‌, ములుగు, ఏటూరునాగారం, జనగామలోని మిల్క్‌‌ చిల్లింగ్‌‌ సెంటర్ల ద్వారా పాలను సేకరిస్తున్నారు. గేదె పాలలో 5 శాతం వెన్న ఉంటే లీటర్‌‌కు రూ.40.05 చెల్లిస్తుండగా, 10 శాతం వెన్న ఉంటే లీటర్‌‌కు అత్యధికంగా రూ.80.10 వరకు చెల్లిస్తున్నారు. ఆవు పాలలో 3 శాతం వెన్న ఉంటే లీటర్‌‌కు రూ. 40.25 ఇస్తుండగా, 4.9 శాతం వెన్న ఉంటే రూ.46.90 ఇస్తున్నారు. దీనితో పాటు ప్రతి లీటర్‌‌కు అదనంగా రూ. 4 చొప్పున ఇన్సెంటివ్‌‌ ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోని పాడి రైతులకు ప్రతిరోజు ఇన్సెంటివ్‌‌ రూపంలోనే రూ.19.84 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ 2020 ఏప్రిల్‌‌ తర్వాత ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో బకాయిలు రూ. 4 కోట్లకు చేరుకున్నాయి. 

పాల సేకరణకు ఇబ్బందులు

గతంలో విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు పాల బిల్లుతో పాటే ఇన్సెంటివ్‌‌ డబ్బులు కూడా అందేవి. కానీ ప్రస్తుతం పాల బిల్లు మాత్రమే అందుతుండడం, అది కూడా లేట్‌‌ అవుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బుల విషయంలో పలుమార్లు పాల సేకరణ కో ఆర్డినేటర్లకు, పాడి రైతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌‌ ప్రభుత్వమైనా స్పందించి ఇన్సెంటివ్‌‌ను విడుదల చేయాలని పాడి రైతులు కోరుతున్నారు.

సమస్యను ప్రభుత్వానికి వివరించాం 

పాడి రైతులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్‌‌ 2020 ఏప్రిల్‌‌ నుంచి పెండింగ్‌‌లో ఉన్నాయి. రైతులకు రావాల్సిన డబ్బుల వివరాలను ప్రతిరోజు పోర్టల్‌‌లో నమోదు చేస్తున్నాం. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే రైతుల అకౌంట్లలో డిపాజిట్‌‌ చేస్తాం. 
– ప్రదీప్, విజయ డెయిరీ డీడీ