వడ్ల పైసలు, రైతు బంధు ఇస్తలేరు

వడ్ల పైసలు, రైతు బంధు ఇస్తలేరు

హైదరాబాద్‌‌, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులు తిరిగి పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులకు పైసల్లేక ఇబ్బందులు పడుతున్నారు. పంట లోన్లు తీసుకుందామంటే ధరణి సమస్యలతో బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నాయి. సర్వే నెంబర్లు లేవని కొన్ని బ్యాంకులు, కొత్త పట్టా పాస్‌‌ బుక్‌‌ ఇవ్వాలని మరికొన్ని బ్యాంకులు, పాత లోన్లున్నా తహసీల్దార్‌‌తో సంతకం పెట్టించుకోవాలని ఇంకొన్ని బ్యాంకులు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో రుణాలు అందక, పెట్టుబడికి పైసల్లేక రైతులు తిప్పలు పడుతున్నారు. ధరణిలో తలెత్తే టెక్నికల్‌‌ ప్రాబ్లమ్స్‌‌తో భూముల సర్వే నెంబర్లు నమోదు కావడం లేదు. కొంతమందికి పాస్‌‌బుక్‌‌లు ఉన్నా కొన్ని బ్యాంకర్ల లాగిన్‌‌లో చూపించడం లేదు. కొన్ని చోట్ల బ్యాంకర్లు ఎంట్రీ చేయడానికి ప్రయత్నించినా ఎంట్రీ కావడం లేదు. కొన్ని గ్రామాలు ఇంకా ధరణిలో నమోదు కాకపోగా, ఇంకొన్ని గ్రామాల్లో సర్వే నెంబర్లలో ఉన్న భూమికి ధరణిలో నమోదైన భూమికి తేడాలున్నాయి. దీంతో బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. 

కొత్త విధానంతోనే సమస్య.. 

గతంలో పట్టా పాస్‌‌బుక్‌‌లు ఉంచుకొని రైతులకు బ్యాంకులు లోన్లు ఇచ్చేవి. అయితే ఇప్పుడు ఆ విధానంలో ఇవ్వడం లేదు. బ్యాంకులకు ధరణి పోర్టల్‌‌ లాగిన్‌‌ ఇచ్చారు. అందులో సర్వే నెంబర్లు చేసే లోన్లు మంజూరు చేస్తున్నారు. అయితే ధరణి పోర్టల్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లోన్లు మంజూరు కావడం లేదు. కాగా, ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీసీఎల్‌‌ఏ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని బ్యాంకర్లు ఏడాదిగా వ్యవసాయశాఖను కోరుతున్నా పట్టించుకోవడం లేదు.  

వడ్ల పైసలు, రైతు బంధు ఇస్తలేరు..  

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపల్‌‌ దిన్నెలో 357 సర్వే నెంబర్‌‌ లో 1970లో దళితులకు పట్టాలు ఇచ్చారు. అయితే వాటిని పార్ట్ బీలో పెట్టడంతో దాదాపు 90 మంది రైతులకు లోన్లు రావడం లేదు. కేసముద్రం మండలం నారాయణపురంలో రైతుల భూములను ఫారెస్ట్‌‌ భూములుగా నమోదు చేయడంతో 2వేల మందికి పైగా రైతులకు క్రాప్‌‌ లోన్లు వస్తలేవు. ఇలా లక్షలాది మంది రైతులకు ధరణి సమస్యలతో లోన్లు రాకుండా పోతున్నాయి. 

ఇచ్చిన లోన్లు 13 శాతమే.. 

ఈ ఏడాది రూ.85,383.30 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు ఎస్‌‌ఎల్‌‌బీసీ టార్గెట్‌‌ పెట్టింది. వానాకాలం సీజన్‌‌లో అందులో 60 శాతం లెక్కన  రూ.51,229.98 కోట్లు క్రాప్‌‌ లోన్లు అందించాలని నిర్ణయించారు. మిగిలిన 40 శాతం వచ్చే యాసంగి సీజన్‌‌కి రూ.34,153.32 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ వానాకాలంలో ఇప్పటి వరకు బ్యాంకులు రూ.6,800 కోట్ల రుణాలు మాత్రమే మంజూరు చేశాయి. అంటే టార్గెట్‌‌లో కేవలం 13 శాతం మాత్రమే రుణాలు ఇచ్చాయి. పైగా ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల్లో రూ.1700 కోట్లు మాత్రమే కొత్త రుణాలు కావడం గమనార్హం.