భారీ వానలతో నిండా మునిగిన రైతులు

భారీ వానలతో నిండా మునిగిన రైతులు
  • 3,970 ఎకరాల్లో వరద వల్ల దెబ్బతిన్న వరి నాట్లు 
  • 463 ఎకరాల్లో నీటమునిగిన ఇతర పంటలు 
  • ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విన్నపం

మెదక్​, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వానలు రైతులను నిండా ముంచాయి. వాగులు, కాల్వలు పొంగి పంట పొలాలను ముంచెత్తాయి. దీంతో  వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, పలు చోట్ల వరినాట్లను ఇసుకమేటలు కప్పేశాయి.  దీంతో   రైతులకు తీవ్ర నష్టం జరిగింది.

4,433 ఎకరాల్లో  నష్టం..

మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 4,433 ఎకరాల్లో  రైతులకు పంట నష్టం జరిగింది. ఇందులో ఎక్కువ శాతం వరి నాట్లను ఇసుక మేటలు కప్పేశాయి. అగ్రికల్చర్​ ఆఫీసర్ల సర్వే ప్రకారం... కొల్చారం, పాపన్నపేట, మెదక్, హవేలి ఘనపూర్​, మాసాయిపేట, నార్సింగి, కౌడిపల్లి, శివ్వంపేట, నర్సాపూర్​, చిన్నశంకరంపేట మండలాల్లో 3,970 ఎకరాల్లో వరి నాట్లు దెబ్బతినగా.. నర్సాపూర్, శివ్వంపేట, టేక్మాల్, కౌడిపల్లి మండలాల్లో 382 ఎకరాల్లో పత్తి.. టేక్మాల్​, కౌడిపల్లి, శివ్వంపేట మండలాల్లో 59 ఎకరాల్లో మొక్కజొన్న, కౌడిపల్లి మండలంలో 10 ఎకరాల్లో కంది పంట, రెండెకరాల్లో సోయాబీన్​ పంట దెబ్బతిన్నది.

పూర్తిగా దెబ్బతిన్న వరి

వనదుర్గా ప్రాజెక్ట్​ (ఘనపూర్​ ఆనకట్ట) ఆయకట్టు పరిధిలోని కొల్చారం మండలం పోతంశెట్​పల్లి, కిష్టాపూర్​, రాంపూర్​ గ్రామాలలో మహబూబ్​నహర్​ కాలువ ఉప్పొంగి భారీ వరద వచ్చి అనేక ఎకరాల్లో పొలాలను ముంచెత్తింది. పొలాలు నీట మునిగి పోవడంతో పాటు, పలు చోట్ల ఇసుక మేటలు కట్టాయి. పాపన్నపేట, హవేలి ఘనపూర్​ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో  వందల ఎకరాల్లో ఇదే పరిస్థితి. వర్షం తగ్గాక రైతులు ఒరాలకు గండ్లు కొట్టడంతో పొలాల్లో నిలిచిన వరద నీరు వెళ్లిపోయి వరి పైర్లు తేలగా, ఇసుక పేరుకున్నచోట వరి పంట పూర్తిగా దెబ్బతింది. ఆయా పొలాల రైతులు ఖర్చయినా సరే మళ్లీ నాటు వేద్దామనుకుంటున్నా పెద్ద మొత్తంలో ఇసుక మేట వేయడంతో సాధ్యమయ్యేలా లేదు. ఏం చేయాలో అర్థం కాక బాధిత రైతులు తలలు పట్టుకుంటున్నారు. వేలాది రూపాయల పెట్టుబడి,  కష్టం నీటి పాలైందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని  కోరుతున్నారు.  

“ఈ ఫొటోలో పారతో ఇసుకను తోడుతుండడం చూసి ఏదో వాగు అనుకునేరు. కాదు వరి పొలం. కొల్చారం మండలం పోతంశెట్​పల్లికి చెందిన ప్రశాంత్​ అనే రైతు వానాకాలంలో రెండెకరాల్లో వరి నాటు వేసిండు. మొన్నటి వానకు బ్రిడ్జి కింద నుంచి పెద్ద వరద వచ్చి పొలమంతా ఇసుక మేటలు వేసి నాటంతా మునిగిపోయింది.  ఇసుక  పెద్ద ఎత్తున ఉండడంతో ఎత్తడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు ’’

50 వేల పెట్టుబడి నీళ్లపాలు 

మేము రెండెకరాలు వరి నాటేసినం. ట్రాక్టర్ తో  పొలం దున్నేందుకు, విత్తనాలు, ఎరువులకు, నాటేసే కూలీలకు 50 వేల దాక పెట్టుబడి అయ్యింది. మొన్నటి వానకు వరద వచ్చి పొలమంతా ఇసుక చేరి నాటంతా పాడైంది. పెట్టిన పెట్టుబడి నీళ్లపాలైంది. సర్కార్​ సాయం చేయకుంటే కష్టమే.

- ఘనపురం శ్రీలత, రైతు,     
పోతంశెట్​పల్లి

ఊరిలో వందెకరాలు ఇట్లనే..

మహబూబ్​నహర్​ కాల్వ మీదికెళ్లి నీళ్లు పొర్లి మస్తు వరద వచ్చింది. వరి పొలాల్లో నడుము లోతు నీళ్లు చేరినయ్. మా ఊర్ల దగ్గర వందెకరాల దాక దెబ్బతిన్నయి. నేను రెండెకరాలు నాటేసిన అంతా నీళ్లపాలైంది.

- బొమ్మడబోయిన మల్లేశం, 
రైతు, కిష్టాపూర్​

మళ్ల నాటెయ్యరాకుంట అయ్యింది..

హైవే రోడ్డు బ్రిడ్జి కిందికెళ్లి పెద్ద వరద వచ్చే సరికి నా వరి పొలమంతా మునిగిపోయింది. నీళ్లు పోయినయి గాని, పొలమంతా ఇసుక, మట్టి పేరుకుపోయింది.  

– రాములు, రైతు, రాంపూర్​