
నిర్మల్, వెలుగు:నిర్మల్ జిల్లాలో సదర్మాట్, కాళ్వేరం కాలువల కోసం భూములిచ్చిన రైతులకు నేటికీ పరిహారం అందలేదు. సాగు నీళ్లు వస్తయ్ అంటే రైతులు వెయ్యి ఎకరాల భూములు ఇచ్చారు. కానీ, ఇప్పటికీ ఆ పనులు కాలేదు, పరిహారమూ అందలేదు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సదర్ మాట్ బ్యారేజీ, కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27, 28 హై లెవెల్ కాలువల కోసం భూముల సేకరించారు. సదర్ మాట్ బ్యారేజీ నిర్మాణం కోసం మొత్తం 1176 ఎకరాలు సేకరించారు. ఇందులో నిర్మల్ జిల్లా లో 806 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 369 ఎకరాలు సేకరించిచారు. నిర్మల్ జిల్లాలో 720 ఎకరాలకు రూ. 73 కోట్ల 28 లక్షల పరిహారాన్ని రైతులకు అందించారు. కానీ, మిగతా 85 ఎకరాల ఏడు గుంటల భూమి కోసం ఐదు కోట్ల రూ. 70 లక్షలను రైతులకు అందించాల్సి ఉందంటున్నారు. అలాగే జగిత్యాల జిల్లాలో మొత్తం 369 ఎకరాల భూమిని సేకరించగా అందులో నుంచి 314 ఎకరాల కు రూ. 31 కోట్ల 64 లక్షలు చెల్లించారు. మరో 55 ఎకరాల మూడు గుంటల భూమికి సంబంధించి రూ. ఐదు కోట్ల 30 లక్షల బకాయి ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం సదర్ మాట్ బ్యారేజీ పరిధిలో మిగితా 141 ఎకరాల సేకరించిన భూమి కోసం 11 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉందని అధికారులులు చెబుతున్నారు.
కాళేశ్వరం కాలువలదీ ఇదే పరిస్థితి
నిర్మల్ , ముధోల్ నియోజకవర్గం కలిపి మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27, 28 హై లెవెల్ కాలువలనునిర్మించారు. ముఖ్యంగా ప్యాకేజీ నెంబర్ 27 పరిధిలో 50వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో పనులు మొదలు పెట్టారు. అయినా పనులు ఇంకా పూర్తికాలేదు. 27వ నెంబర్ ప్యాకేజీ కాలువ నిర్మాణం కోసం 2 వేల500 ఎకరాల భూమిని ఉంచాలని ప్రతిపాదించారు. ఇందులో నుంచి 1 వేయి 621 ఎకరాల భూమిని సేకరించి పరిహారం డబ్బులు అందించినప్పటికీ మరో 374 ఎకరాల భూమికి సంబంధించి 10 కోట్ల రూపాయల మేర రైతులకు చెల్లించాల్సి ఉంది . దాదాపు రెండేళ్ల నుంచి రైతులంతా ఈ పరిహారం డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.
పరిహారం ప్రపోజల్స్ పంపాం..
నిర్మల్ జిల్లాలోని సదర్ మాట్, కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27 హై లెవెల్ కెనాల్ కు సంబంధించి మిగిలిన పరిహారం డబ్బుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. ఇప్పటికే రైతులకు మొదట్లో సేకరించిన భూములకు సంబంధించి పరిహారాన్ని చెల్లించాం. మిగతా భూముల కు సంబంధించి పరిహారం డబ్బులను త్వరలోనే చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నాం. నిధులు విడుదల కాగానే చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుంది.
- రామారావు,ఈఈ, ఇరిగేషన్, నిర్మల్