
- భారీ వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన కౌలు రైతులు
- ఖమ్మం జిల్లాలో 68 వేల ఎకరాల్లో తీవ్రంగా పంట నష్టం
- 46,374 మందిలో 15 వేల మంది కౌలు రైతులు
- ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామన్న సర్కారు
- కౌలు రైతులకే పరిహారం ఇవ్వాలంటున్న బాధితులు
ఖమ్మం, వెలుగు: భారీ వర్షాలు, వరదల వల్ల ఖమ్మం జిల్లాలో రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారు. కాల్వలకు గండ్లు పడడం, చెరువులు అలుగు పోయడంతో పంట భూముల్లో ఇసుక మేటలు వేశాయి. ఎడతెరిపిలేని ముసురు కురవడంతోనూ పత్తి, మిర్చి వంటి తోటల్లో వాన నీరు ఎక్కువ రోజులు నిలిచి ఉండడంతో పంట నష్టం జరిగింది. ఇలా 68, 345 ఎకరాల్లో 46,374 మంది రైతులు పంటలు నష్టపోయి నట్టు అధికారుల అంచనా వేశారు. కాగా జిల్లాలో పంటలు సాగు చేసిన వారిలో 30 శాతానికిపైగా కౌలు రైతులే ఉన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కౌలు రైతుల సంఖ్య ఎక్కువ. ఇప్పుడు వర్షాలతో నష్టపోయిన రైతుల్లో 15 వేల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. ఇక వరదల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు రూ.16, 500 చొప్పున నష్ట పరిహారం ఇస్తున్నట్టుగానే, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కౌలు రైతులకు ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కౌలు రైతులు కోరుతున్నారు. భూ యజమానులకు ముందుగానే కౌలు పైసలు చెల్లించి పంటలు సాగు చేసినట్టు, ఇప్పుడు పరిహారాన్ని కూడా భూ యజమానులకు చెల్లిస్తే ఎలా అని వాపోతున్నారు. గ్రామాల వారీగా వ్యవసాయ శాఖ సిబ్బందితో సర్వే చేయించి, కౌలు రైతుల వివరాలను సేకరించి నష్టపోయిన భూమిలో పంట సాగుచేసిన వారికే పరిహారం చెల్లించాలని బాధిత కౌలు రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కౌలు రైతులకు పరిహారం ఇవ్వాలి
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గ్రామాల్లో ప్రభుత్వం ద్వారా సమాచారం సేకరించి, కౌలు రైతులు సాగు చేస్తున్న భూములకు ఇచ్చే పరిహారం కౌలు రైతులకే చెల్లించేలా చూడాలి. ఆర్థికసా యం అందించే జాబితాలో కౌలు రైతులను నమోదు చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులకు కూడా పరిహారం అందించాలి.
- బొంతు రాంబాబు, ఖమ్మం జిల్లా రైతు సంఘం కార్యదర్శి
రూ.లక్షన్నర నష్టపోయా..
ఎకరానికి రూ.30 వేల చొప్పున ఇద్దరు రైతుల దగ్గర రెండెకరాల పది గుంటల భూమిని రూ.67 వేలకు కౌలుకు తీసుకొని వరి పంట వేశాను. పాలేరు రిజర్వాయర్ నిండి అలుగు పోయడంతో వరదల్లో వరి పంట అంతా నీటి పాలైంది. ఎకరానికి పెట్టుబడి రూ.25వేలు, 5హెచ్ పీ మోటార్ రూ. 40వేలు, స్టార్టర్ బాక్స్ రూ.10వేలు, కౌలు డబ్బులు కలుపుకొని రూ. లక్షన్నర నష్టపోయా. నాలాంటి కౌలు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. తేజావత్ వెం కౌలు రైతులకు సాయం ఎట్ల! కన్న, తుమ్మలతండా, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా
“ఖమ్మం జిల్లా మధిర మండలం నాగవరప్పాడుకి చెందిన మొరుబోయిన కోటేశ్వరరావు కౌలు రైతు. 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. కొద్ది రోజుల కిందట కురిసిన భారీ వర్షాల వల్ల చేనులో వరద నీరు నిలిచిపోవడంతో పత్తి పంట నాశనమైంది. పెట్టుబడి, విత్తనాలు, కౌలుకు కలిపి మొత్తంగా రూ. లక్షన్నర వరకు నష్టపోయాడు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని లేదంటే చావు తప్ప మరోమార్గం లేదని బాధిత కౌలు రైతు వాపోతున్నాడు.’’