- మహబూబాబాద్ జిల్లాలో 1,64,124 ఎకరాల్లో వరి సాగు అంచనా
- 84,261 ఎకరాల్లో మొక్క జొన్న సాగు
మహబూబాబాద్, వెలుగు: యాసంగి సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజీ_1, స్టేజీ_2ల పరిధిలో కాలువల ద్వారా నీరు అందే అవకాశం ఉండటం, బోర్లు బావుల్లో సమృద్ధిగా జలాలు ఉండటంతో వరి సాగుపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. ఈసారి 1,64,124 ఎకరాల్లో వరి సాగు చేయనుండగా, 84,261 ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించనున్నట్లు అధికారులు అంచనా వేశారు.
జిల్లాలో సమృద్ధిగా జలాలు..
మానుకోట జిల్లాలో 1590 చెరువుల ద్వారా 95,460 ఎకరాలు, ఎస్సారెస్పీ స్టేజీ_1 ద్వారా 1,24,336 ఎకరాలు, ఎస్సారెస్పీ స్టేజీ_2 ద్వారా 80,719 ఎకరాలు ఆయకట్టు సాగు అవుతుంది. యాసంగిలో బోర్లు, బావుల్లో జలాలు సమృద్ధిగా ఉండటంతో పాటు కొన్ని చోట్ల చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంది.
యాసంగిలో జిల్లాలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీరు అందే అవకాశం ఉండటంతో రైతులు ఎక్కువగా వరి సాగు చేసే అవకాశాలున్నాయి. జిల్లాలో రైతులు ఇప్పటికే నారుమడులను సిద్ధం చేసుకున్నారు. కొన్ని చోట్ల దుక్కులను దమ్ము చేస్తుండగా, మరి కొన్నిచోట్ల సాగుకు సన్నద్ధమవుతున్నారు.
యాసంగి పంటల సాగు అంచనా..
మహబూబాబాద్ జిల్లాలో వరి 1,64,124 ఎకరాలు, మొక్క జొన్నలు 84,261 ఎకరాలు, జొన్నలు 1,565 ఎకరాలు, వేరుశెనగ 1,043, పెసర 2,879, మినుములు394, బొబ్బర్లు 1,261 ఎకరాల్లో సాగు చేయనున్నారు. జిల్లాలో మొత్తంగా 2,55,527 ఎకరాల్లో పంటలను సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఎరువుల అంచనాలు..
యాసంగిలో పంటల సాగు కోసం యూరియా 59,273.78 టన్నులు, డీఏపీ 3,157.025, ఎంవోపీ 1,828.75, కాంప్లెక్స్ ఎరువులు 20,978.86, ఎస్ఎస్పీ 738.2 టన్నులు అవసరం కానున్నాయి.
యూరియా కొరత లేకుండా చూడాలి..
యాసంగిలో పంటల సాగు కోసం సాగునీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు సకాలంలో యూరియా అందించేలా చర్యలను చేపట్టాలి. యాప్ బుకింగ్ ద్వారా యూరియాను అందిస్తామని అధికారులు తెలుపుతున్నా, అది అమలుకు నోచుకోవడం లేదు. పీఏసీఎస్, ఇతర దుకాణాల్లో కొద్దిపాటిగా యూరియా అందుబాటులో ఉన్నా, ఇతర పురుగుమందులు, గుళికలు బలవంతంగా అంటగడుతున్నారు. రైతులు పంటలను సాగు చేయడానికి సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి.- శేరి నర్సయ్య, రైతు, నెల్లికుదురు
మేలు రకాలైన విత్తనాలను ఎంచుకోవాలి..
రైతులు వరి, మొక్క జొన్న, ఇతర పంటలను యాసంగిలో సాగు చేయడానికి మేలు రకాలైన విత్తనాలను ఎంచుకోవాలి. కొనుగోలు సమయంలో రసీదులు తప్పనిసరిగా పొందాలి. రైతులు పంటల సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులను, సలహాలు, సూచనలు వివరించడానికి ఆయా క్లస్టర్ల పరిధిలో ఏఈవోలు అందుబాటులో ఉంటారు. పంటల సాగుకు అవసరమైన అన్నిరకాల ఎరువులను అందుబాటులో ఉంచుతాం. - విజయ నిర్మల, జిల్లా వ్యవసాయ అధికారిణి, మహబూబాబాద్
