
- ఖానాపూర్, పొన్కల్, నచ్చన్ ఎల్లాపూర్ లో రాస్తారోకోలు
- ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వ్యాఖ్యలపై రైతుల వాగ్వాదం
నిర్మల్, వెలుగు: అకాల వర్షాలతో ఐకేపీ సెంటర్లలో తడిసిన వడ్లను కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. గురువారం నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు రాస్తారోకోలు చేపట్టి తడిసిన ధాన్యాన్ని కొనాలంటూ డిమాండ్ చేశారు. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ లో రైతుల రాస్తారోకో వద్దకు స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వెళ్లారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలే ఆందోళన చేస్తున్నారంటూ అక్కడ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
ఏ పార్టీకి చెందినవాళ్లం కాదని తామంతా రైతులమంటూ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఇప్పటివర కు వడ్ల కొనుగోలు జాప్యంపై ఎందుకు సమీక్షించలేదని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే రైతులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం సేకరణ వేగంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులు ఆందోళన చెందొద్దని పూర్తిగా కొనుగోలు చేస్తామంటూ ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఖానాపూర్ లో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రైతుల రాస్తారోకోకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు.
సివిల్ సప్లై డీఎం, ఖానాపూర్ తహసీల్దార్ వెళ్లి చర్చించారు. దిమ్మదుర్తిలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ పరిశీలించి రైతులు ఆందోళనకు గురికావద్దని హామీనిచ్చారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ మార్కెట్ యార్డును ఎమ్మెల్యే వెడమ బొజ్జుతో కలిసి పరిశీలించారు. తూకంపై అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని నిర్వాహకులకు సూచించారు.