తినే పంటలు వేయట్లే.. ఆహార పంటలపై దృష్టి పెట్టని రాష్ట్ర సర్కారు

తినే పంటలు వేయట్లే.. ఆహార పంటలపై దృష్టి పెట్టని రాష్ట్ర సర్కారు

తినే పంటలు వేయట్లే
ఆహార పంటలపై దృష్టి పెట్టని రాష్ట్ర సర్కారు
వాణిజ్య పంటల వైపే రైతుల మొగ్గు 
ఆయిల్‌‌ సీడ్స్‌‌, మిల్లెట్ల సాగూ అంతంతే
వరి ఎక్కువ వేస్తున్నా తినే రకాలు వేయట్లే

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో రైతులు వాణిజ్య పంటల వైపే ఎక్కువగా  మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఆహార పంటల సాగు గణనీయంగా తగ్గుపోతున్నది. రాష్ట్ర సర్కారు ఆహార పంటలపై దృష్టి సారించకపోవడంతో వాణిజ్యం పంటల సాగు పెరుగుతున్నది. ఇండియన్‌‌  కౌన్సిల్‌‌  ఫర్‌‌ అగ్రికల్చర్‌‌  రిసర్చ్‌‌(ఐసీఏఆర్‌‌) సూచన మేరకు ప్రజలకు పౌష్టికాహారం అందుబాటులో ఉండాలంటే అన్ని ఆహార పంటల సాగును ప్రోత్సహించాలి. కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు పెరగాల్సి ఉంది. ఆ దిశలో సర్కారు ప్రయత్నాలు చేయకపోవడంతో రైతులు ఆహార పంటలను పక్కన పెట్టి ఆదాయం వచ్చే పంటలనే వేస్తున్నారు. ఫలితంగా నువ్వులు, పల్లీలు, జొన్నలు, బొబ్బర్లు, కందులు, ఉలవలు, మినుములు, పెసలు వంటి పంటల జాడే కరువవుతున్నది.

ఐదు పంటల సాగే పైపైకి

రాష్ట్రంలో పత్తి, వరి పంటలే వానాకాలంలో ఎక్కువగా సాగవుతున్నాయి. రాష్ట్రంలో వానాకాలం కోటి 50 వేల ఎకరాల వరకు సాగు జరుగుతుందనే అంచనా ఉంటే అందులో కోటి ఎకరాలకు పైగా ఈ రెండు పంటలే ఉంటున్నాయి. 2014 వానాకాలంలో పత్తి, వరి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ సాగు  మొత్తం సాగు విస్తీర్ణంలో 86.2 శాతం ఉండె. 2020–21 నాటికి ఈ ఐదు పంటల సాగు 90.1 శాతానికి చేరింది. ఇప్పుడు వీటి సాగు మరింత పెరగవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వరి ఎక్కువ వేస్తున్నా.. తినే రకాలను రైతులు వేయడం లేదంటున్నారు.

వరి ఎక్కువ వేస్తున్నా.. బియ్యం ధర తగ్గట్లే

రాష్ట్రంలో వరి సాగు ఏటా పెరుగుతున్నా  బియ్యం ధర మాత్రం తగ్గట్లేదు. దీనికి ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లే కారణమనే ఆరోపణలు ఉన్నాయి.  రాష్ట్రంలో రైతులు ఎక్కువగా దొడ్డు రకం వరి సాగు చేస్తున్నారు. ఇదంతా అమ్ముకోవడానికి తప్పితే తినడానికి వాడడం లేదు. ఇక సన్నరకాలు సాగు చేసినా రైతులకు దిగుబడి రావడం లేదు. దీనికితోడు మార్కెట్‌‌లో దొడ్డు రకం వడ్లను సర్కారు కొంటుండగా సన్న రకాలను మార్కెట్‌‌లో వ్యాపారులు, మిల్లర్లు కొంటున్నారు.  ప్రజలు తినే బియ్యం వ్యాపారుల చేతికి పోవడంతో కిలో రూ.50 వరకు అమ్ముడవుతున్నది. కానీ, రైతుకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. 

ఫుడ్‌‌ క్రాప్స్‌‌ వేయక పౌష్టికాహారం దొరకట్లే..

ఇండియన్‌‌  కౌన్సిల్‌‌  ఫర్‌‌  మెడికల్‌‌  రిసర్చ్‌‌  లెక్క ప్రకారం ప్రతి మనిషికి రోజుకు 400 గ్రాముల తృణధాన్యాలు, 60 గ్రాముల పప్పులు, 60 గ్రాముల నూనె గింజలు, 325 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు అవసరం. కానీ, ఈ పంటల సాగు రాష్ట్రంలో తగ్గుతున్నది. క్రాప్‌‌  ప్లాన్‌‌ రూపొందించడంలో వ్యవసాయ శాఖ విఫలం అవుతున్నది. దీంతో ఫుడ్‌‌  క్రాప్స్‌‌  వేయక పౌష్టికాహారం దొరడం లేదు. వేరుసెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల పంటల అవసరాలు గణనీయంగా ఉన్నాయి. వాటి సాగు లేక దిగుమతి మీద ఆధారపడాల్సి వస్తున్నది.  

కాటన్‌‌ సాగు పెరిగినా దిగుబడి తగ్గుతున్నది

రాష్ట్రంలో కాటన్  విస్తీర్ణం 75 లక్షల ఎకరాలకు పెంచాలని సర్కారు యోచిస్తున్నది. పండిన పత్తి అంతా సీసీఐ కొంటుందనే ధీమాతోనే సర్కారు పత్తి సాగును ప్రోత్సహిస్తున్నది. అయితే అంత విస్తీర్ణంలో కాటన్‌‌  సాగుకు అనుకూలమైన భూములు లేవు. సరైన భూములు లేకపోయినా పత్తి సాగు చేస్తున్నారు. దీంతో పత్తి దిగుబడులు పడిపోతున్నాయి. మరోవైపు కాటన్‌‌, మిర్చి, పసుపు పంటలు వాణిజ్య పంటలు కాగా.. తాజాగా వరి కూడా తినే పంట నుంచి అమ్ముకునే పంటగా మారిపోతున్నది. కాటన్‌‌, మిర్చి పంటల సాగు పెరిగినా తగిన దిగుబడి రాక రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక పసుపు పంటకు ధర రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు తినే పంటలు వేస్తే ప్రజలకు పోషక విలువలు అందడంతో పాటు రైతుల ఆదాయం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నరు.

కూరగాయలు, మిల్లెట్ల  సాగు కిందికి

రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగి సాగునీరు అందుబాటులోకి రావడంతో గతంలో కూరగాయలు పండించే రైతులు కూడా వరి, పత్తికి మారిపోతున్నారు. దీంతో కూరగాయల సాగు పడిపోయి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయి. పౌష్టిక ఆహారం అందించే మిల్లెట్స్‌‌ సాగు కూడా పడిపోతున్నది. కేంద్రం ఇంటర్నేషనల్‌‌ మిల్టెట్స్  ఇయర్‌‌ అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. కానీ, రాష్ట్రంలో ఆ ప్రయత్నమే జరగడం లేదు. దీంతో పౌష్టికారం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పోషక విలువలున్న పంటలకు ప్రోత్సాహం లేక లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన పంటలు వేలల్లోనే సాగువుతున్నయి.