
- ఎన్నికల ప్రచారస్త్రంగా మారబోతున్న కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపు అంశం
- నగర సమస్యలపై పోటాపోటీగా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు వినతులు
- అభివృద్ధి పనుల్లో అవినీతి లెక్క తేల్చాలని ఫిర్యాదులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో లీడర్లు బస్తీ బాట పట్టారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల పునర్విభజన పూర్తి కావడం, డివిజన్ల పరిధులపై క్లారిటీ రావడంతో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆశావహులు జనం కోసం కాస్తా టైం కేటాయిస్తున్నారు. తమ ఏరియాల్లో ఉన్న సామాజికవర్గాలు, ఇన్ ఫ్లుయెన్సర్ల డేటాను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఆయా కాలనీ పెద్దలు, ప్రభావితం చేయగల వ్యక్తులను కలిసి మద్దతు కోరుతున్నారు.
శుభకార్యాలకు వెళ్లి ఆశీస్సులు అందిస్తూ.. చావులకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అవసరమైతే ఎంతోకొంత ఆర్థిక సాయం చేసేందుకు వెనుకాడడం లేదు. మరోవైపు అన్ని పార్టీల ముఖ్య నాయకులు కూడా సిటీపై పట్టుకోసం రోజుకో కార్యక్రమం తీసుకుంటున్నారు. కరీంనగర్ లో మూడు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉండడంతో తమ పార్టీ నుంచి మరో పార్టీలోకి క్యాడర్ చేజారుకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నగర సమస్యలపై పోటాపోటీ వినతులు
పెండింగ్ పనులను పూర్తి చేయాలంటూ ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలవగా.. మిగతా లీడర్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. కరీంనగర్‌లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, పెండింగ్ పనులు పూర్తి చేయాలంటూ జూన్ 30న ఎమ్మెల్యే గంగుల మాజీ కార్పొరేటర్లతో వెళ్లి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో మరుసటి రోజే జులై 1న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు, నాయకులతో వెళ్లి కమిషనర్‌ను కలిసి పెండింగ్ పనులు, తాగునీటి సరఫరా, డంపింగ్ యార్డ్.. తదితర సమస్యలపై చర్చించారు.
ఆ తర్వాత బుధవారం మానేరు ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. మరోవైపు నగరంలో గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిని వెలికి తీయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేయగా.. ఇదే డిమాండ్ తో బీజేపీ నేత, మాజీ మేయర్ సునీల్ రావు మరో ఫిర్యాదు ఇవ్వడం గమనార్హం.
డంపింగ్ యార్డు తరలింపు చుట్టే రాజకీయం..
కరీంనగర్ మానేరు ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డును తరలించాలంటూ కొన్నాళ్లుగా పరిసర కాలనీలకు చెందిన జనం ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కోతిరాంపూర్, లక్ష్మీనగర్, వరసిద్ధి కాలనీ, అలకాపురి కాలనీ, హౌసింగ్ బోర్డు, బైపాస్ రోడ్డు ఏరియా కాలనీల ప్రజలు ఆందోళనలు నిర్వహించడంతోపాటు పలుమార్లు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బయోమైనింగ్ పూర్తికాకపోవడం, చెత్త గుట్టలుగా పేరుకుపోవడంతో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనే విమర్శలను బీఆర్ఎస్ లీడర్లు ఎదుర్కొనే అవకాశముంది.
అలాగే డంపింగ్ యార్డు తరలింపునకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించి ఆర్నెళ్లు దాటినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ లీడర్లకు కూడా స్థానికుల నుంచి వ్యతిరేకత తప్పేలా లేదు. మొత్తంగా వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో డంపింగ్ యార్డు తరలింపు అంశం ప్రచార అస్త్రంగా మారనుంది. అలాగే విలీన గ్రామాల సమస్యలు, కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, అసంపూర్తిగా ఉన్న రోడ్లు, డ్రెయినేజీ పనులు కూడా ఎన్నికల ప్రచారస్త్రాలుగా మారే అవకాశముంది.