
- మహిళా సంఘాల్లో చదువురానివారు
- ఉమ్మడి జిల్లాలో 1,92,864 మంది గుర్తింపు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
- విద్యాశాఖ, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ
నల్గొండ, యాదాద్రి, వెలుగు : మహిళా సంఘాల్లో చదువురాని వారిని గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. దేశంలోని ప్రతి మహిళకు చదువు చెప్పాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ అన్ ఇన్ సొసైటీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. 15 ఏండ్ల వయస్సు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, వారికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా 60,405 మహిళా సంఘాలు ఉండగా, 6,18,982 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో చదువురానివారు 1,92,864 మంది ఉన్నారు. మొదట మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా మార్చడం, రెండో దశలో మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదో తరగతితోపాటు వారి ఆసక్తిని బట్టి ఓపెన్ డిగ్రీ వరకు చదివించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
మహిళలకు ఉపాధి కల్పించేలా..
మహిళా సంఘాల్లో ఉన్న సభ్యుల్లో కేవలం 50 శాతం మందికి మాత్రమే సంతకం చేయడం వచ్చని, మిగతా సగం మంది వేలిముద్రలు వేస్తారనేది ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం. వయోజన మహిళలకు చదవడం, రాయడం నేర్పించడమే కాకుండా మధ్యలో బడి మానేసిన వారిని సైతం గుర్తించి వారిని నేరుగా ఓపెన్ టెన్త్, ఆసక్తి ఉంటే ఓపెన్ డిగ్రీ చదివిస్తారు. ఆ తర్వాత వారికి స్కిల్ డెవలప్‌మెంట్, టెక్నికల్ కోర్సులు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉల్లాస్ పథకాన్ని అమలు చేయనున్నారు. అంతేకాకుండా మహిళలకు బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను సైతం నేర్పిస్తారు.
నిరక్షరాస్యుల గుర్తింపు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్‌డీఏ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులను గుర్తించే పనిలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగే కార్యక్రమాన్ని సెర్ప్ అధికారులు ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న మహిళా సంఘం సభ్యుల్లో నిరక్షరాస్యుల సంఖ్యను వీవోఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)ల ద్వారా ఏపీవోలు గుర్తించారు. గత నెలలో సంఘాల్లో నిరక్షరాస్యులు, మధ్యలో బడిమానిన వారిని గుర్తించి నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి పథకానికి సంబంధించిన విధివిధానాలను సెర్ప్ అధికారులు, సిబ్బందికి సమగ్రంగా వివరించినట్లు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.
వలంటీర్లుగా అక్షరాస్యులు..
డీఆర్‌డీవో, సెర్ప్ ఆధ్వర్యంలో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేసి వారిలో 15 నుంచి 20 మంది చొప్పున ఒక్కో గ్రూపును ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామంలో మహిళా సంఘాల్లో అక్షరాస్యులైన వారిని వలంటీర్లుగా ఎంపిక చేసి నిరక్షరాస్యుల గ్రూపులను కేటాయించి వారికి చదువు చెప్పిస్తారు. గ్రూపులో ఉన్న వారందరికీ చదవడం, రాయడం వచ్చే వరకు వీరికి చదువు చెప్పే బాధ్యత వలంటీర్లదే. ఎలాంటి పారితోషికం, గౌరవ వేతనంగా లేకుండానే కేవలం సేవాభావంతో వలంటీర్లు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ పుస్తకాలు అందించడంతోపాటు విజయవంతం అయ్యేందుకు ఆయా గ్రామాల్లోని టీచర్ల ద్వారా సహకారం అందించనున్నారు. మొదటి విడతగా నల్గొండ జిల్లాలో 61,170 మందికి డీఈవో ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో హెచ్ఎంలు క్లాసులు చెబుతారు. ఇందులో ప్రతి పది మందికి ఒకరి చొప్పున వలంటీర్లను ఎంపిక చేస్తారు.
మహిళలకు మంచి అవకాశం
నిరక్షరాస్యులైన మహిళలకు చదవడం, రాయడం నేర్పించాలనే ఉద్దశంతో ప్రభుత్వం ఉల్లాస్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం చదువురాని మహిళలకు మంచి అవకాశం. జిల్లాలో ఉన్న మహిళా సంఘాల్లో నిరక్షరాస్యుల వివరాలను వయోజన విద్యాశాఖ అధికారులకు అందించాం. ఇందులో భాగంగా మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులతోపాటు బడి మధ్యలో మానేసిన వారికి, దివ్యాంగులకు సైతం చదవడం, రాయడం నేరిస్తారు.
శేఖర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ, నల్గొండ జిల్లా
జిల్లాల్లోని సంఘాలు, సభ్యుల వివరాలు..
జిల్లా సంఘాలు సభ్యులు చదువు
రానివారు
నల్గొండ 28,703 2,97,288 1,21,859 సూర్యాపేట 17,579 1,83,752 41,526
యాదాద్రి 14,123 1,37,942 29,479
మొత్తం 60,405 6,18,982 1,92,864