
- పైలట్ ప్రాజెక్ట్ కింద భద్రాచలం జిల్లాలోని నాలుగు రీచ్‌ల ఎంపిక
- ఇసుక ర్యాంప్‌ల నిర్వహణపై ఐటీడీఏ ఆధ్వర్యంలో శిక్షణ
- గిరిజన మహిళలకు ఆర్థిక స్వావలంబన
- అదే సమయంలో రేజింగ్ కాంట్రాక్టర్ల దోపిడీకి చెక్
భద్రాచలం, వెలుగు : సహజవనరులపై ఆదివాసీలకే పూర్తి హక్కులు కల్పించే దిశగా కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తోంది. ఏజెన్సీ ఏరియాల్లోని ఇసుక రీచ్‌లను ఎక్కడికక్కడ గిరిజన మహిళా సొసైటీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని శివాజీనగర్, రామానుజవరం, భద్రాచలం నియోజకవర్గంలోని గొమ్ముగూడెం, దానవాయిపేట ఇసుక ర్యాంపులను పైలట్‌ప్రాజెక్టు కింద గిరిజన మహిళా సొసైటీలకు అప్పగించింది. ఇప్పటికే ఆయా సంఘాల్లోని మహిళలకు ఇసుక ర్యాంపుల నిర్వహణపై ఐటీడీఏ ఆధ్వర్యంలో టీజీఎండీసీ ఆఫీసర్లు శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇన్నాళ్లూ ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా భద్రాచలం మన్యంలోని గోదావరి ఇసుక రీచ్‌లను గిరిజనుల పేరుతో దక్కించుకున్న రేజింగ్కాంట్రాక్టర్లు కోట్లకు పడగెత్తారు. అదే సమయంలో అమాయకులైన గిరిజనులకు కూలి కూడా గిట్టుబాటు కాలేదు. సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయంతో రేజింగ్ కాంట్రాక్టర్ల ఆగడాలకు ఇక చెక్ పడినట్లేనని, ఆ మేరకు గిరిజనులకు లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయం
వ్యక్తమవుతోంది.
మెషినరీ కోసం టెండర్లు పిలిచిన ఐటీడీఏ
ఇసుకను తవ్వడంతో పాటు లారీల్లోకి లోడ్ చేయడం, ఒడ్డుపైన డంప్ చేయడానికి అవసరమైన మెషినరీ కోసం ఐటీడీఏ పీవో బి.రాహుల్ టెండర్లు పిలిచారు. ఒక్కో రీచ్‌కు రెండు ఎస్కవేటర్లు, నాలుగు టిప్పర్లు, రెండు డోజర్లు, రెండు వాటర్ స్రింక్లర్లు అద్దె ప్రాతిపదికన కావాలంటూ టెండర్లలో పేర్కొన్నారు. భద్రాచలం ఐటీడీఏతో ఎంప్యానల్ చేసుకునేందుకు ఆసక్తి కలిగిన గిరిజన ఏజెన్సీలు అప్లై చేసుకోవాలని పీవో సూచించారు. దరఖాస్తులు శుక్రవారం నుంచి 10వ తేదీ వరకు ఐటీడీఏలో అందుబాటులో ఉంటాయని, ఒక్కో అప్లికేషన్‌కు రూ.10 వేలు చెల్లించాలని తెలిపారు. దరఖాస్తు ఫారం, ఈఎండీ కింద రూ. రెండు లక్షలు భద్రాచలం, ఐటీడీఏ పీవో పేరిట తీసిన డీడీని ఈ నెల 18లోపు ఐటీడీఏలో సమర్పించాలని పేర్కొన్నారు.
అప్లికేషన్లను బట్టి రీచ్‌ల పెంపు
ట్రైబల్ ఏజెన్సీల నుంచి మెషినరీలను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రస్తుతం టెండర్లు పిలిచారు. వచ్చిన అప్లికేషన్లను బట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన నాలుగు ఇసుక సొసైటీలనే కాకుండా.. మరిన్ని పెంచే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ, బినామీలకు చెక్ పెట్టేందుకు మాత్రమే ఈ విధానానికి శ్రీకారం చుట్టామని ఆఫీసర్లు చెబుతున్నారు. అప్లికేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే మిగిలిన రీచ్‌లను కూడా ఈ ఏజెన్సీలకు అప్పగిస్తారు. సొసైటీలోని గిరిజన మహిళలే ర్యాంప్ నిర్వహణను చేపట్టేలా ప్లాన్ చేశారు. దాని నుంచి వచ్చిన ఆదాయం కూడా పూర్తిగా వారికే చెందనుంది.
ఒక్కో సొసైటీకి రూ. 50 లక్షలు
రేజింగ్ కాంట్రాక్టర్ల ముసుగులో ఇన్నాళ్లూ బినామీలు ఇసుక సొసైటీల్లోకి చేరడంతో గిరిజన మహిళల ఉపాధికి భారీగా గండిపడుతోంది. దీంతో ఈ విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇసుక తవ్వకాలు, లోడింగ్, డంపింగ్‌లో గిరిజన మహిళల ఇక్కట్లను గుర్తించి, ఐటీడీఏ ద్వారా ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని నిర్ణయించారు. టీజీఎండీసీ సహకారంతో ర్యాంప్‌ల నిర్వహణ పూర్తిగా గిరిజన మహిళలకే అప్పగించేలా ప్లాన్ చేశారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన సొసైటీలకు ర్యాంప్ నిర్వహణ కోసం ఒక్కో సొసైటీకి రూ. 50 లక్షలు కేటాయించారు. ఈ డబ్బులతో మెషినరీని అద్దెకు తీసుకువచ్చి, నిర్వహణను గిరిజన మహిళా సొసైటీ సభ్యులకు అప్పగించనున్నారు.
గిరిజన మహిళల స్వయం ప్రతిపత్తి కోసమే..
ఇసుక సొసైటీల ద్వారా గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించనున్నారు. వారి స్వయం ప్రతిపత్తి కోసమే ఈ విధానం అమలుల్లోకి తీసుకొచ్చాం. గిరిజన మహిళలకు ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చాం. ఆర్థికంగా, సాంకేతికంగా ఐటీడీఏ అండగా ఉంటుంది. ఇసుక ర్యాంపుల ద్వారా ఆదాయం వారికే చెందేలా చర్యలు చేపట్టాం. - బి.రాహుల్, ఐటీడీఏ పీవో, భద్రాచలం