భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నత్తనడకన రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నత్తనడకన రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు
  • కొత్తగూడెంలో ప్రయాణికుల పాట్లు.. పట్టించుకోని అధికారులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అమృత్​ భారత్​ స్కీంలో భాగంగా రూ. 25.41కోట్లతో కొత్తగూడెం (భద్రాచలం రోడ్​ ) రైల్వే స్టేషన్​లో చేపడుతున్న ఆధునికీకరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు.. ప్రయాణికులు పాట్లు తప్పడం లేదు.

ఇదీ పరిస్థితి.. 

దేశంలోని రైల్వే స్టేషన్లను అమృత్​ భారత్​ స్కీంలో భాగంగా దశల వారీగా ఆధునికీకరిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో నే అమృత్​ స్కీంలో చేపట్టిన పలు రైల్వే స్టేషన్లను ఆయన ప్రారంభించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్​ను ఆధునికీరించడంతోపాటు ప్రయాణికుల కోసం పలు సౌకర్యాలను కల్పించేందుకు రైల్వే శాఖ రూ. 25.41 కోట్లను కేటాయించింది. 2023లో పనులు మొదలయ్యాయి. ఏడాదిలోపు పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటి వరకు 60శాతం  పనులు కూడా పూర్తి కాలేదు. ప్లాట్​ఫాంతో పాటు వెయిటింగ్​హాల్, ఎస్కలేటర్, లిఫ్ట్​ లాంటి పనులు ఆగుతూ సాగుతున్నాయి. 

అవస్థల్లో ప్రయాణికులు.. 

కొత్తగూడెం రైల్వే స్టేషన్​ నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ప్రముఖ్య పుణ్యక్షేత్రమైన భద్రాచలంతో పాటు పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు లాంటి పారిశ్రామిక ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు కొత్తగూడెం రైల్వే స్టేషన్​ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఆధునికీకరణ పనుల్లో తీవ్ర జాప్యంతో ప్రయాణికులు స్టేషన్​ ఆవరణలోనే పడిగాపులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం వానలు కురుస్తుడడంతో వారి ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి.  పనుల్లో జాప్యంపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఇప్పటికే సీరియస్​ 
అయ్యారు. 

క్వాలిటీ లేని పనులు.

రైల్వే స్టేషన్​ పనుల్లో నాణ్యత లోపించింది. పనులు చేపడుతున్న క్రమంలో పగుళ్లు ఏర్పడుతుండడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందిగా ఉంది.. 

రైల్వే స్టేషన్​ పనులు ఏండ్ల తరబడి కొనసాగుతుండడంతో ఇబ్బందిగా ఉంది. వర్షం వచ్చినప్పుడు తడిసిపోతున్నాం. రైల్వే అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలి. 

కాసర్ల రాజమల్లు, ప్రయాణికుడు 

ఎవరూ పట్టించుకోవట్లే.. 

రైల్వే స్టేషన్​ఆధునికీకరణ పనులు స్లోగా నడుస్తుండడంపై రైల్వే అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చాం. ఇటీవల డీఆర్​యూసీసీ మీటింగ్​లోనూ చెప్పాం. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పనులు స్పీడప్​ చేయాలి.

వై శ్రీనివాస్​ రెడ్డి, డీఆర్​యూసీసీ మెంబర్​, కొత్తగూడెం