ఈ వ్యవస్థ.. రైతులను సైలెంట్గా చంపుతోంది: రాహుల్గాంధీ

ఈ వ్యవస్థ.. రైతులను సైలెంట్గా చంపుతోంది: రాహుల్గాంధీ
  • ప్రధాని మోదీ మాత్రం చోద్యం చూస్తున్నరు: రాహుల్ గాంధీ 
  •  రుణమాఫీ, ఎంఎస్‌‌‌‌‌‌‌‌పీకి చట్టబద్ధతను పట్టించుకోవట్లేదు
  • మహారాష్ట్రలో 3 నెలల్లో 767 మంది రైతులు బలయ్యారని ఆవేదన 

న్యూఢిల్లీ: రైతుల ఆత్మహత్యలు, రైతులపై అప్పుల భారం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, రైతులు రోజురోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో 2025 జనవరి నుంచి మార్చి వరకు 767 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారనే ఒక వార్తాకథనం స్క్రీన్‌‌‌‌‌‌‌‌షాట్‌‌‌‌‌‌‌‌ను గురువారం ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడ్డారు. 

“ఇది కేవలం ఒక నంబర్ కాదు, 767 కుటుంబాల విషాదం. ఈ కుటుంబాలు ఎన్నటికీ కోలుకోలేవు. అయినా రాష్ట్రం, కేంద్రంలోని డబుల్ ఇంజిన్ ​సర్కార్ నిశ్శబ్దంగా, నిర్లక్ష్యంగా చూస్తున్నది” అని ఆయన పేర్కొన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు, డీజిల్ ధరల పెరిగి అప్పుల్లో కూరుకుపోతున్నారని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌‌‌‌‌‌‌పీ)కు చట్టబద్ధ హామీ లేకపోవడం వారిని మరింత కష్టాలు, నష్టాల్లోకి నెడుతున్నదని రాహుల్ అన్నారు. 

రైతుల రుణాలు మాఫీ చేయాలనే డిమాండ్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అయితే కార్పొరేట్లకు, సంపన్నులకు మాత్రం వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నదని విమర్శించారు. అనిల్ అంబానీకి సంబంధించిన రూ.48,000 కోట్ల ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ‘మోసం’ కేసును ఈ సందర్భంగా పేర్కొన్నారు. “రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ హామీ నీటి బుడగైంది. వ్యవసాయదారుల జీవితాలు నాశనమవుతున్నాయి. 

బీజేపీ ప్రభుత్వ సారథ్యంలో నడుస్తున్న ప్రస్తుత వ్యవస్థ రైతులను నిశ్శబ్దంగా, నిరంతరంగా చంపుతున్నది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చైనా ఎరువులు బందై.. రైతుల అవస్థలు..

మనం 80 శాతం స్పెషాలిటీ ఎరువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఇటీవల చైనా సప్లై ఆపేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. యూరియా, డీఏపీ వంటి ఎరువుల కొరత ఇప్పటికే రైతులను వేధిస్తుంటే ఇప్పుడు మరో సమస్య వచ్చిందన్నారు. చైనా ఎరువులపై ఆధారపడటం రైతులకు శాపంగా మారిందని  విమర్శించారు. 

దేశీయ ఎరువుల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని విదేశీ ఎరువులపై ఆధారపడడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దీనిపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందించారు. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ హయాంలో 15 ఏండ్లలో 55,928 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ‘ఎక్స్’​లో పోస్ట్ చేశారు. ఆత్మహత్యల గణాంకాలతో రాజకీయం చేయడం దారుణమని విమర్శించారు.