రైతుల ఆదాయం రెట్టింపెలా?: ఇండియాను ప్రశ్నించిన WTO

రైతుల ఆదాయం  రెట్టింపెలా?: ఇండియాను ప్రశ్నించిన WTO

న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎలా రెట్టింపు చేస్తారని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) లో యూరోపియన్ యూనియన్ ప్రశ్నించింది.యూఎస్, ఇండియాలో వ్యవసాయానికి అనుకూలంగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న స్కీమ్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న డబ్ల్యూటీవో సభ్యులు ఈ నెల 25, 26న జరిగే అగ్రికల్చర్ కమిటీ  సమావేశానికి 62 పేజీల ప్రశ్నలను రెడీ చేశారు.  వ్యవసాయానికి అనుకూలంగా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్,  ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న ప్రాధాన్యతలపై  ప్రశ్నలు లేవనెత్తారు. చైనాతో టారిఫ్ వార్  నుంచి కలిగే నష్టాన్ని దేశీయంగా పూరించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని,  వ్యవసాయంపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థలో తక్కువ వృద్ధిరేటు నమోదు సమస్యను ప్రధాని మోడీ ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేస్తారు,  వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి 357.5 బిలియన్ డాలర్లను ఎలా ఖర్చు చేయబోతున్నారో చెప్పాలని ఇండియాను యూరోపియన్ యూనియన్ ప్రశ్నించింది.

నాన్ బాస్మతి రైస్, గోధుమ పై 5 శాతం ఎక్స్ పోర్ట్ సబ్సిడీపై ఇండియాను యూఎస్ ప్రశ్నించింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్ సాయంపై వివరాలు ఇవ్వాలని ఇండియాను యూఎస్, ఆస్ట్రేలియా కోరాయి. ఎక్స్ పోర్ట్ సబ్సిడీని దశలవారీగా ఎత్తివేయాలని ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది. 16 బిలియన్ డాలర్లతో ట్రంప్ సర్కారు అమలు చేస్తున్న మార్కెట్ ఫెసిలిటేషన్ ప్యాకేజ్ ను ఇండియాతోపాటు ఆస్ట్రేలియా, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, ఉక్రెయిన్ ప్రశ్నించాయి. డబ్ల్యూటీవో నిబంధనలకు  అమెరికా తూట్లు పొడుస్తోందని చైనా ఆరోపించింది. 19 బిలియన్ డాలర్ల డిజాస్టర్ బిల్లును అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించడంపై యూరోపియన్ యూనియన్ ఆరా తీసింది. ఈ బిల్లుతో మొక్కజొన్నకు 55 శాతం, సోయాబీన్ కు 60 శాతానికి బదులుగా 90 శాతం క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు వీలవుతుందని చెప్పింది. యూఎస్ ఫార్మ్ బిల్ 2018 ని ఇండియా విమర్శించింది. దీని వల్ల రైతులే కాదు వాళ్ల అన్నదమ్ముల పిల్లలు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు, వాళ్ల పిల్లలు, భార్యలకు కూడా లాభం పొందుతారని విమర్శించింది. బ్రెగ్జిట్ ప్రభావంపై కెనడా, ఆస్ట్రేలియాలు ప్రశ్నలను లేవనెత్తాయి.