
రైతు బీమా అప్లికేషన్ గడువు ఆగస్టు 13 వరకే ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పట్టా పాస్ బుక్స్ వచ్చిన రైతులు ఆగస్టు 13 వరకు రైతు బీమా అప్లై చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఇది వరకు పట్టా పుస్తకాలు ఉండి రైతు బీమా దరఖాస్తు చేయని వారికి కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.
రైతు బీమా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫారం తో పాటు పట్టా పాస్ బుక్ లేదా పాస్ బుక్ జిరాక్స్ జతచేయాల్సి ఉంటుంది. ఈ రెండూ లేని పక్షంలో MRO డిజిటల్ సంతకంతో కూడిన DS పేపర్ అయినా ఉండాలని సూచించారు. వీటికి తోడు రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది.
రైతు బీమా అప్లై చేసుకోవాలంటే ఆధార్ ప్రకారం వయసు 18 ఏళ్ల నుంచి 59 ఏండ్లు లోపు ఉండాలి. అంటే 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్యలో పుట్టిన వారై ఉండాలి.
రాష్ట్రంలో రైతు బీమాకు సంబంధించి 2025-26 బీమా సంవత్సరం ఆగస్టు 14 నుంచి షురూ కానుంది. ఈ నెల 13 వరకు గత ఏడాది బీమా గడువు ముగియనుంది. గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల్లో బీమాకు అర్హులను వ్యవసాయశాఖ గుర్తించనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 76 లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉన్నారు. అర్హులైన రైతులు కొత్తగా రైతుబీమా దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు మొదటి వారం నుంచి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఈ యేడు 2025-26 రైతు బీమా కోసం కొత్తగా లక్షలాది అప్లికేషన్లు రావడంతో వారిలో అర్హులను గుర్తించి రైతు బీమా పోర్టల్లో అధికారులు అప్లోడ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.