విజయ డెయిరీలో కల్తీ పాల కలకలం

విజయ డెయిరీలో కల్తీ పాల కలకలం
  •     పాలను తిప్పి పంపడంతో చేర్యాల ప్రాంత  రైతుల ఆందోళన
  •     కల్తీ పరీక్షల​ పేరుతో మోసం చేస్తున్నారని ఫైర్

చేర్యాల, వెలుగు : సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని విజయ డెయిరీ కేంద్రానికి కల్తీ పాలు వస్తున్నాయని చేర్యాల ప్రాంత రైతులు శనివారం ఆందోళన చేశారు. గత కొంత కాలంగా రైతులు పాలల్లో ఉప్పు, చక్కెర కలుపుతున్నారని ఆరోపిస్తూ పాల శీతలీకరణ కేంద్రం అధికారులు పాలను రిజెక్ట్​ చేయడంతో రైతులు ధర్నాకు దిగారు. ఈనెల 29న చేర్యాల కేంద్రం నుంచి హైదరాబాద్​కు తరలించిన 5 వేల లీటర్ల పాలను అధికారులు రిజెక్ట్​  చేయడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశంతో చేర్యాల కేంద్రంలో అధికారులు టెస్టులు నిర్వహించారు.

పాలల్లో ఉప్పు కలిసి ఉందని గుర్తించి 52 క్యాన్లను రిజెక్ట్​  చేయడంతో ఆ పాలను పారబోశారు.  గ్రామాల్లోని విజయ డెయిరీ సెంటర్ల వద్ద పరీక్షించి కొనుగోలు చేసిన పాలను డెయిరీలో కల్తీ పరీక్షల  పేరుతో ఉప్పు శాతం  ఉందంటూ రిజెక్ట్  చేయడం సరికాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు చేసిన తప్పును అందరి రైతులపై రుద్దడం సరికాదన్నారు. తాము ఎలాంటి ఉప్పు, చక్కెర కలుపలేదన్నారు. తాము తెచ్చిన పాలలో ఉప్పు శాతం ఎందుకు వస్తోందని రైతులు ప్రశ్నించగా డెయిరీ మేనేజర్​ మురళి సమధానం చెప్పకపోవడంతో రైతులు మండిపడ్డారు.

విజయ డెయిరీ ప్లాంటులో పాల నిల్వలు ఎక్కువ కావడంతో పాల కొనుగోలు తగ్గించడానికే అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. విజయ పాల డెయిరీ కార్పోరేషన్​ ఇచ్చిన రుణాలతోనే తాము ఆవులను కొనుగోలు చేశామని, ఇప్పుడు అధికారులు పాలను కొనుగోలు చేయమని అంటే తమ పరిస్థితి ఏంటనిఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్  చేశారు.

రైతుల ఆందోళన విషయమై విజయ డెయిరీ మేనేజర్​ మురళిని వివరణ కోరగా ఈనెల 28న చేర్యాల విజయ డెయిరీ కేంద్రం నుంచి హైదరాబాద్​ డెయిరీకి పంపిన పాల ట్యాంకర్ లో ఉప్పు శాతం ఉందని ట్యాంకర్ ను అధికారులు వెనక్కి పంపించారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రైతులు తెచ్చిన పాలను పరీక్షించి ఉప్పు శాతం ఉన్న పాలను కొనుగోలు చేయడం లేదని చెప్పారు.