జమ్మికుంటలో రోడ్లపైన రైతుల ఆందోళన

జమ్మికుంటలో రోడ్లపైన రైతుల ఆందోళన

జమ్మికుంట, వెలుగు : కరీంనగర్​ జిల్లా ఇల్లందకుంట మండలం ఇల్లందకుంట, కనగర్తి, శ్రీరాములపల్లి గ్రామాల నుంచి రైతులు తమ మండలానికి కేటాయించిన నాగంపేట రైసుమిల్లుకు గురువారం ఉదయం ఉదయం 7గంటలకే వడ్లు తెచ్చారు. మిల్లు గేటుకు తాళాలు వేసి ఉంచడం, మధ్యాహ్నం 12గంటలైనా తెరవకపోవడంతో  రైతులు తాము వడ్లు తెచ్చిన 70 వాహనాలను జమ్మికుంట,-వావిలాల రోడ్డు మీద నిలిపి..  3గంటల పాటు ఆందోళనకు దిగారు. అక్కడ వచ్చిన  జమ్మికుంట పోలీసులు రైతులను శాంతింపజేసేందుకు  ప్రయత్నించినప్పటికి రైతులు, పోలీసుల మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. క్వింటాలు కు 7కిలోల తరుగు తీస్తామంటున్నారని, ఈ మేరకు మిల్లర్లు రాతపూర్వకంగా ఇవ్వాలన్నారు.  తరుగు పేరుతో క్వింటాలుకు 7కిలోల చొప్పున  దోచుకుంటున్నారని,  హుజూరాబాద్​ఆర్డీవో, జమ్మికుంట ఎమ్మార్వో వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.  ట్రాఫిక్​కు  నిలిచిపోవడంతో పోలీసులు..   ఓనర్లను పిలిపించి మిల్లు తాళాలు తీయించారు. కొన్ని లారీలను కోరపల్లి రైస్​ మిల్లుకు తరలించారు.  పోలీసులు దగ్గరుండి  ధాన్యాన్ని దింపించడంతో గొడవ సద్దుమణిగింది. 

ధాన్యం తరలిస్తలేరని రాస్తారోకో

నందిపేట, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో కాటాలు పూర్తయినా  ధాన్యం బస్తాలను తరలించడంలేదని  ఆరోపిస్తూ గురువారం నిజామాబాద్‌ జిల్లా నందిపేట వెల్మల్ చౌరస్తాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.  ఒక్కో సెంటర్​లో రోజుకు 3 వేల బస్తాలు  తూకం వేస్తున్నప్పటికీ రెండు లారీలు కూడా రావడం లేదని రైతులు ఆరోపించారు. అనుకోకుండా  వర్షం పడితే కేంద్రాల్లో వడ్లు తడిసిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటినుంచి  బార్దాన్​, లారీల కొరత ఉందన్నారు. మిల్లర్లు రెండు,మూడు కిలోల తరుగు తీస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.  రెండు గంటలకు పైగా  రైతులు రస్తారోకో చేశారు.  తహసీల్దర్​ అనిల్​ కుమార్​అక్కడకు చేరుకుని..  కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలను పరిశీలించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు లారీల కాంట్రాక్టరుతో మాట్లాడారు.  తూకం పూర్తయిన వెంటనే వడ్లను తరలించేందుకు అవసరమైన లారీలను పంపించాలని ఆదేశించారు.  దీంతో రైతులు రాస్తారోకో విరమించారు.