ఏనుమాముల మార్కెట్ పీఎస్ ఎదుట..రైతుల ఆందోళన

ఏనుమాముల మార్కెట్ పీఎస్ ఎదుట..రైతుల ఆందోళన

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్‌‌లోని ఏనుమాముల మార్కెట్లో ఆదివారం రైతులు, పలువురు వ్యాపారులు ఆందోళనకు దిగారు. గత నెలలో రంగపురం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి వరంగల్ ఛాంబర్‌‌కు వచ్చాడు. స్వప్న, రాజు, రమేశ్​అనే వ్యక్తులు కలిసి ఏఎస్‌‌కే ఆగ్రోస్ ఎంటర్‌‌ప్రైజెస్ పేరిట, అలాగే విల్సన్ కంపెనీ పేరుతో ఫారాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి మిర్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిర్వహిస్తూ వ్యాపారం చేపట్టి సుమారు రూ.6 కోట్లకు పైగా లావాదేవీలు జరిపారు. 

అయితే రైతులు, వ్యాపారులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వకపోవడంతో బాధితులు ఏనుమాముల మార్కెట్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుని రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. బకాయిల చెల్లింపుల విషయంలో తగిన చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

అనంతరం రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల రైతులు దళారీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. భవిష్యత్తులో రైతులకు ఇలాంటి అన్యాయం జరగకుండా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.