
గద్వాల, వెలుగు: కలెక్టరేట్ వద్ద బైఠాయించి రైతులు పురుగు మందు డబ్బాలతో హల్ చల్ చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం కలకలం రేపింది. తమ పొలాన్ని కబ్జా చేసి అందులో మసీదు నిర్మిస్తున్నారని, అధికారులు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతులు చిన్న నరసింహ, ఆంజనేయులు,లక్ష్మన్న కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గద్వాల జిల్లా కేంద్రం శివారులోని సర్వే నంబర్లు 899, 897లో తమకు వారసత్వంగా వచ్చిన భూమి ఉందన్నారు. ఆ భూమి వక్ఫ్ ది అని చెప్పి కొందరు కబ్జా చేశారని ఆరోపించారు. అందులో రాత్రికి రాత్రే మసీదు కూడా నిర్మించారని వాపోయారు. తమ సమస్యను అధికారులకు చెప్పుకునేందుకు వస్తే కలెక్టరేట్ లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేసేదేమీ లేకనే కుటుంబాలతో పురుగుల మందు తాగి చనిపోతామని ఆందోళనకు దిగారు. తమకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్నారు. దీనికి తోడు ప్రస్తుతం రెవెన్యూ కోర్టులో కేసు ఉండగా దౌర్జన్యంగా వచ్చి కబ్జా చేస్తున్నారని వాపోయారు. రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.