హుస్నాబాద్​ మార్కెట్​ యార్డులో రైతుల ఆందోళన

 హుస్నాబాద్​ మార్కెట్​ యార్డులో రైతుల ఆందోళన

కోహెడ/హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నాలుగు రోజులు గడుస్తున్నా వడ్ల కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకువచ్చి పక్షం రోజులు గడుస్తోందని, కేంద్రాన్ని ప్రారంభించి నాలుగు రోజులవుతున్నా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ చేపట్టలేదని వాపోయారు.

రైతుల ఆందోళనకు బీజేపీ కిసాన్ సంఘ్ నాయకులు మద్దతు తెలిపారు. మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు విషయమై ఎవరిని అడుగుదామన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో లేరన్నారు. వర్షాలు పడితే అరుగాలం కష్టపడి పండించిన వడ్లు నీళ్లపాలు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వడ్ల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలె

కొమురవెల్లి: వడ్ల కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.  తహసీల్దార్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, నాయకుడు నక్కల యాదవరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. చేసేది లేక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని చెప్పారు. క్వింటాల్​వడ్లకు రూ.450 వరకు నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, లేకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.