తరుగుకు ఒప్పుకోలేదని వడ్లు వాపస్

తరుగుకు ఒప్పుకోలేదని వడ్లు వాపస్
  • కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో రైతుల రాస్తారోకో.. 
  • లారీలు రావడంలేదని లింగంపేటలో ధర్నా 

కామారెడ్డి / లింగంపేట, వెలుగు: వడ్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభంలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మిల్లర్లు తరుగు తీస్తామనడం.. కొన్న వడ్లను తరలించేందుకు లారీలు లేకపోవడంతో కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. తరుగు తీయడానికి ఒప్పుకోవడం లేదన్న కారణంతో రైస్‌‌ మిల్లుకు పంపిన వడ్ల లోడును మిల్లర్లు వెనక్కి పంపడంతో మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి వద్ద శనివారం రాస్తారోకో చేపట్టారు. బస్తాకు 3 కిలోల తరుగు తీస్తున్నారని, దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. తహసీల్దార్​ శ్రీనివాస్​రావు అక్కడికి చేరుకొని రైతులతో చర్చించారు. కోతలు లేకుండా చూస్తామని చెప్పినా రైతులు వినలేదు. పోలీసులు వచ్చి రైతులను అదుపులోకి తీసుకున్నారు. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత రైతులను వదిలిపెట్టారు.

లారీలు పంపుతలే

వడ్ల కొనుగోలు కేంద్రాలకు లారీలను పంప డంలో జిల్లా ఆఫీసర్లు విఫలమయ్యారని, వెంటనే లారీలను పంపాలంటూ లింగంపేట కొనుగోలు కేంద్రం ఎదుట రైతులు ధర్నా చేశారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రధాన రో డ్డు కావడంతో ట్రాఫిక్‌‌‌‌కు అంతరాయం కలి గింది. ఇక్కడ 2రోజుల కింద కొనుగోళ్లు ప్రారంభించారు. తూకం వేసిన వడ్లను మిల్లులకు తరలించడానికి లారీలను పంపకపోవడంతో వడ్లు కేంద్రాల్లోనే ఉంటున్నాయి. వడ్ల బస్తాలను ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌లో తరలిస్తే మిల్లు యజమాని దించుకోవడం లేదని ఆరోపించారు. కొనుగోళ్లు మొదలుకాకముందే వడ్లను సెంటర్లకు తెచ్చామని, 25 రోజుల నుంచి కుప్పల దగ్గర పడిగాపులు పడుతున్నామని వాపోయారు. ఆందోళన చేస్తున్న రైతులతో స్థానిక ఎమ్మార్వో మారుతి మాట్లాడారు. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి లారీలు వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన  విరమించారు.