లారీలు రావట్లే.. తూకం వేయట్లే.. కడెం మండల రైతులు హైవేపై బైఠాయించి నిరసన

లారీలు రావట్లే.. తూకం వేయట్లే..  కడెం మండల రైతులు  హైవేపై బైఠాయించి నిరసన

కడెం, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూస్తున్నా కొనుగోళ్లు చేపట్టడం లేదంటూ నిర్మల్ జిల్లా కడెం మండల రైతులు ఆందోళనకు దిగారు. నచ్చన్ ఎల్లాపూర్ చౌరస్తా వద్ద లింగాపూర్, సారంగాపూర్, మాసాయిపేట్ గ్రామాల రైతులు నిర్మల్–మంచిర్యాల హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. 

కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడంతో అధికారులు ధాన్యం తూకం వేయడం లేదని, తూకం వేసిన ధాన్యాన్ని కూడా తరలించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

 దాదాపు గంటపాటు హైవేపై ధర్నా కొనసాగుతుండగా లింగాపూర్‌‌కు చెందిన రైతు ఆకుల నరసయ్య స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని కడెం ఆస్పత్రికి తరలించారు. సీఐ అజయ్, ఆర్‌‌ఐ శారద, ఎస్సై రాహుల్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. 

అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని, తరలింపును వేగవంతం చేయాలని రైతులు అధికారులను వేడుకున్నారు. త్వరలోనే కొనుగోళ్లు పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

మార్కెట్​ గేటుకు తాళం వేసి నిరసన

కరీంనగర్: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌‌లో మక్క రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మార్కెట్‌‌కు మక్కలు తీసుకొచ్చి 20 రోజులైనా కొనడం లేదంటూ మార్కెట్ మెయిన్ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మార్కెట్‌‌కు వచ్చే మామిడి రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులను లోపలికి రాకుండా మెయిన్ గేట్ మూసివేశారు. పోలీసులు, మార్కెటింగ్ అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.