శివ్వంపేటలో యూరియా కోసం రైతుల రాస్తారోకో

శివ్వంపేటలో యూరియా కోసం రైతుల రాస్తారోకో
  • శివ్వంపేటలో పోలీసులతో గొడవ 

శివ్వంపేట, నర్సాపూర్, పుల్కల్, వెలుగు:  యూరియా కోసం రైతులు మంగళవారం శివ్వంపేటలో తూప్రాన్ - నర్సాపూర్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. గంటపాటు బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం 5 గంటల నుంచి యూరియా కోసం వచ్చి క్యూ లైన్ లో చెప్పులు, ఇటుకలు పెట్టి పడిగాపులు కాస్తున్న యూరియా బస్తా దొరకడం లేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకో విరమించాలని పోలీసులు చెప్పడంతో ఆవేశంతో వారితో గొడవకు దిగారు. 

సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. యూరియా కొరతను నిరసిస్తూ ధర్నా నర్సాపూర్ లో చౌరస్తావద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుతీతారెడ్డి నర్సాపూర్ మీదుగా గోమారం వెళ్తుండగా చౌరస్తా వద్ద నిరసన కారులు వాహనాన్ని ఆపి యూరియా అందడం లేదని మొరపెట్టుకున్నారు. వారికి మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 

వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేను అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ లోని శ్రీ సాయిరాం ఫెర్టిలైజర్  నిర్వహకులు 45 కిలోల యూరియా సంచి రూ.266 ఉండగా రూ.300 లకు అమ్ముతూ దోపిడీ చేస్తున్నారని ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె విఠల్ రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో ఎరువులను పంపిణీ చేసి ఆదుకోవాలని కోరారు.