
- ఆయకట్టు చివరి భూములకు సరిగా సాగు నీరు అందట్లేదు
- సూర్యాపేట ఇరిగేషన్ ఎస్ఈ ఆఫీసు వద్ద రైతుల ఆందోళన
సూర్యాపేట, వెలుగు: ఎస్సారెస్పీ ఎల్– 36 కాల్వ పరిధిలోని పంటలకు సరిపడా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సూర్యాపేట జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ ఆఫీసు వద్ద మోతె, చివ్వెంల, నడిగూడెం మండలాలకు చెందిన రైతులు నిరసన తెలిపారు. ఎస్సారెస్పీ ఎల్ –36 కాల్వ పరిధిలోని ఆయకట్టుకు సరిపడా సాగు నీరు అందక చివరి భూముల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వారబందీ పద్ధతిని రద్దు చేసి చివరి భూములకు నీరందేలా చూడాలని కోరారు. సమస్యపై స్థానిక అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తక్షణమే సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, అధికారులు హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని బైఠాయించారు.
నీళ్లు విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీర భద్రయ్య, ఉపాధ్యక్షులు ముప్పాని లింగారెడ్డి, సహాయ కార్యదర్శి ఉప్పల మల్లయ్య, పాలకూరి ఎల్లయ్య, నల్లగొండ ఎంకన్న, రమేశ్ బాబు, తండు మల్సూరు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.