
కౌడిపల్లి, శివ్వంపేట, నిజాంపేట, రామాయంపేట, సిద్దిపేట, కొహెడ, తూప్రాన్, నర్సాపూర్, వెలుగు : యూరియా దొరకడం లేదని సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని సొసైటీ ముందు నర్సాపూర్ రోడ్డుపై రైతులు ధర్నాకు దిగారు. దీంతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. యూరియా ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు.
కౌడిపల్లిలో నేషనల్ హైవే మీద యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. నిజాంపేట్ నస్కల్ గ్రామంలో యూరియా పంపిణీ చేస్తారని తెలిసి రైతులు ఉదయమే తరలి వచ్చి లైన్ లో నిల్చున్నారు. రామయంపేట సొసైటీ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు బందోబస్తు నడుమ రైతులకు యూరియాను పంపిణీ చేశారు. తూప్రాన్‌లో ఆర్డీవో జయచంద్రారెడ్డి డీఏవో దేవకుమార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు.
రైతులు భవిష్యత్ అవసరాల కోసం ఇప్పుడే యూరియా కొంటున్నారన్నారు. అందువల్లే యూరియా కొరత వస్తుందన్నారు. భూ విస్తీర్ణానికి సరిపడ బస్తాలు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. నర్సాపూర్‌లో యూరియా కొరతను నిరసిస్తూ రైతులు రైతు వేదిక వద్ద నేషనల్ హైవే పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ మురళీయాదవ్ రైతులకు మద్దతునిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సకాలంలో యూరియా సరఫరా చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, ఇరుకోడుల్లో రైతులు రాస్తారోకో కు దిగారు. సోమవారం ఉదయమే ఆయా కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకొని టోకెన్లు లేకుండా అందించాలని డిమాండ్ చేశారు. ఎవరూ స్పందించక పోవడంతో సిద్దిపేటలో కరీంనగర్ రోడ్డులో, ఇర్కోడులో సిద్దిపేట మెదక్ హైవేపై, మండల కేంద్రాలైన చిన్నకోడూరు, నంగునూరుల్లో రైతులు రాస్తారోకో చేశారు.
పోలీసులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కొహెడ మండల కేంద్రంలో యూరియా సరఫరాపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణకు సరిపడ యూరియాను కేంద్ర ప్రభుత్వం అందించడం లేదని మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య ఆరోపించారు.