యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు

సిద్దిపేట, శివ్వంపేట, , జిన్నారం, వెలుగు: యూరియా కోసం రైతులు సిద్దిపేట, అక్కన్నపేట, దుబ్బాక మండలం చీకోడుల్లో రాస్తారోకో నిర్వహించారు. శనివారం యూరియా ఇస్తామని చెప్పడంతో ఆయా కేంద్రాలకు చేరుకున్న రైతులకు స్టాక్ రాలేదని, టోకెన్లు ఇస్తాం ఆదివారం రండని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. సకాలంలో రైతులకు  యూరియా అందించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. యూరియా కోసం వెళ్తే రైతన్నలను ఫర్టిలైజర్  వ్యాపారులు  చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా రెండు  బస్తాలే  ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారికి నచ్చజెప్పడంతో అసంతృప్తితో రైతులు వెనుదిరిగారు. 

నంగునూరు లో యూరియా స్టాక్ వచ్చిందని తెలియగానే పెద్ద ఎత్తున రైతులు పీఎసీఎస్ కు తరలివచ్చారు. యూరియా కోసం బారులు తీరడంతో పోలీసు పహారాలో పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లాలోని జిన్నారం పట్టణంలో యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్​షాప్​ ముందు గంటలతరబడి క్యూ కట్టారు. మెదక్​జిల్లా శివ్వంపేటలో శనివారం యూరియా ఇస్తామని చెప్పి రైతులకు టోకెన్లు ఇచ్చారు. ఉదయం 5 గంటలకే వచ్చి క్యూ లైన్ లో నిలబడితే సాయంత్రం 4 గంటలకు యూరియా లేదని ఆఫీసర్లు చెబుతున్నారని రైతుల తూప్రాన్,- నర్సాపూర్ రోడ్డుపై ధర్నాకు దిగారు. 

ఇల్లు, పొలాలు వదిలి పొద్దంతా పడిగాపులు గాస్తున్న యూరియా ఇవ్వడం లేదని ఎస్సై, తహసీల్దార్ తో గొడవకు దిగారు. యూరియా కోసం ఉదయమే  లేచి ఆటో కిరాయికి తీసుకొని పది కిలోమీటర్ల దూరం నుంచి ప్రాథమిక సహకార సంఘం వద్దకు వస్తే రేపు రండి, ఎల్లుండి రండి అంటూ తిప్పుతున్నారని మండిపడ్డారు. ఆదివారం యూరియా ఇస్తామని సీఈవో చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.